తాజా వార్తలు

Published : 19/06/2021 02:03 IST
అధికారుల దందా

జీహెచ్‌ఎంసీలో సొంత వాహనాలకు అద్దె తీసుకుంటోన్న వైనం

నిరుద్యోగులవుతున్న డీసీఓ పథకం లబ్ధిదారులు

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు నిరుద్యోగుల ఉపాధికి గండికొడుతున్నారు. వాహన చట్టానికి విరుద్ధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌(డీసీఓ) పథకాన్ని సమాధి చేస్తున్నారు. అద్దె వాహనాల రూపంలో అదనపు సంపాదనకు తెరలేపారు. సొంత కార్లను ఉపయోగిస్తూ ట్రావెల్‌ ఏజెన్సీల బిల్లులతో నిధులు దండుకుంటున్నారు. డీసీఓ పథకం కింద కార్లను కొనుగోలు చేసిన నిరుద్యోగులకు దీని వల్ల ఉపాధి కరవవుతోంది. ఎక్కడెక్కడో తిరిగే కార్ల నంబర్లతో బల్దియాలో ఏటా రూ.50కోట్ల మేర బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. వాహన, రోడ్డు పన్ను, ఇతర ఛార్జీలు చెల్లించడంలేదు.

400లకుపైగా వాహనాలు

రాష్ట్ర సర్కారు, జీహెచ్‌ఎంసీ ఉమ్మడిగా ఐదేళ్ల కిందట డీసీఓ పథకాన్ని అమలు చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నిరుద్యోగ యువతకు రాయితీ కింద కార్లు అందించి, వాళ్లకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధి చూపించడం ఆ పథకం ముఖ్యోద్దేశం. మొత్తం 400 కార్లు ఇచ్చారు. ప్రారంభంలో ఈ వాహనాలను ఇంజినీరింగ్‌, రవాణా, ప్రణాళిక ఇతరత్రా విభాగాల అధికారులకు అప్పగించారు.

నెలకు రూ.34వేలు..

గతంలో అద్దె వాహనాల నెల రుసుము తక్కువ ఉండేది. 2017లో ఆ మొత్తం రూ.34వేలకు పెంచి మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ట్యాక్సీ నంబరు ప్లేటు ఉన్న కారు డ్రైవరుకు డ్రైవింగ్‌ లైసెన్సుతోపాటు బ్యాడ్జీ ఉండాలి. ఫిట్‌నెస్‌, బీమా, పన్ను చెల్లింపులు క్రమం తప్పకుండా జరగాలి. మామూలు కారుతో పోలిస్తే.. ఆయా రుసుములు మూడు రెట్లు ఎక్కువ. ప్రతి ఆరు నెలలకోసారి పొల్యూషన్‌ ధ్రువీకరణపత్రాన్ని తీసుకోవాలి. అలాంటి వాహనాలనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించాలి. వ్యక్తిగత వాహనాలను ఉపయోగిస్తూ అద్దె తీసుకుంటే.. యజమానులపై చర్యలు తప్పవు. కానీ జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అధికారులుగానీ, రవాణశాఖ యంత్రాంగంకానీ ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ట్రావెల్‌ యాజమాన్యాలు ఇచ్చే నకిలీ బిల్లులతో ఏటా జీహెచ్‌ఎంసీ కోట్లాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్నా రవాణా శాఖ నిద్రమత్తు వీడట్లేదన్న విమర్శలొస్తున్నాయి.

అవకతవకలు ఇలా..

* అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌తో జట్టు కట్టారు. ట్రావెల్స్‌ యజమానికి ఒక్కో నకిలీ బిల్లుకు రూ.4వేలు ఇస్తున్నారు. ఆ బిల్లు చూపించి బల్దియా ఖజానా నుంచి రూ.34వేల అద్దె తీసుకుంటున్నారంటూ డీసీఓ సంఘం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదు చేసింది. నకిలీ వాహన నంబర్లతో అద్దె తీసుకుంటున్న 17 మంది అధికారుల జాబితానూ అందించింది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

* ఎల్బీనగర్‌ సర్కిల్‌ యూసీడీ విభాగంలో పని చేసే ఓ అధికారి ఇంటి నుంచి కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. పీఎల్‌ఆర్‌ ట్రావెల్స్‌ పేరుతో ప్రతినెలా రూ.34వేలు అద్దె తీసుకుంటున్నారు.

* కేంద్ర కార్యాలయంలోని రవాణా విభాగంలో గతంలో పనిచేసిన ఓ కంప్యూటర్‌ ఆపరేటరు.. అతను అక్కడ పనిచేస్తున్నప్పుడు బినామీ ట్రావెల్‌ ఏజెన్సీని స్థాపించి అద్దె కార్ల దందా ప్రారంభించారు. అవినీతి ఆరోపణలతో అక్కడి నుంచి బదిలీ అయినప్పటికీ.. ఆయన బినామీ ట్రావెల్‌ ఏజెన్సీలకు సంబంధించిన సుమారు 10 కార్లకు ఇప్పటికీ బిల్లులు మంజూరవుతున్నాయి.

ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు..

- రాజేశ్వరరావు, డీసీఓ సంఘం అధ్యక్షుడు

డ్రైవర్‌ ఓనర్‌ పథకాన్ని జీహెచ్‌ఎంసీనే మొదట అమలు చేసింది. నిరుద్యోగ యువతకు కార్లు అందించి ఉపాధి చూపింది. క్రమంగా ఒక్కో అధికారి డీసీఓ కార్లను పక్కనపెట్టి.. సొంత వాహనాలను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 70శాతం పని లేక ఖాళీగా ఉన్నాయి. కొవిడ్‌ వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతోంది. చాలా మంది కిస్తీలు చెల్లించలేక వాహనాలను అమ్ముకుంటున్నారు. కుటుంబాలను పోషించుకోలేక ఊర్లకు వెళ్లిపోతున్నారు. చట్ట విరుద్ధంగా నడుస్తోన్న వాహనాలను కమిషనర్‌ వెంటనే తొలగించాలి.

ఏడాది నుంచి ఖాళీగా ఉన్నా..

శేషు, డీసీఓ కారు యజమాని

గత సంవత్సర కాలంగా నాకు పని ఇవ్వలేదు. ఇటీవల కేంద్ర కార్యాలయం డీపీఓ హోదా(కూకట్‌పల్లి సర్కిల్‌) లోని ఓ అధికారిణి వద్ద వాహనాన్ని నడిపించేందుకు కాంట్రాక్టు ఇచ్చింది. వారం పని చేశాక ఆమె నా కారు వద్దని సొంత వాహనాన్ని ఉపయోగిస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని