తాజా వార్తలు

Updated : 19/06/2021 08:36 IST
HYD: కట్నం కోసం కరోనా సోకిందన్నాడు..

భార్యను గదిలో బంధించి వేధింపులు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలంటూ ఇల్లాలిని వేధించాడో భర్త. మాట విననందుకు ఆమెకు కరోనా సోకిందంటూ గదిలో నిర్బందించాడు. విషయం తెలుసుకున్న పారాలీగల్‌ వాలంటీర్‌.. బాధితురాలికి అండగా నిలిచారు. జగద్గిరిగుట్టకు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తీసుకురావాలని భార్యను ఒత్తిడి చేసేవాడు. తన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనంటూ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను చాలా రోజుల పాటు ఓ గదిలో నిర్బందించాడు. చుట్టుపక్కల వారు అడిగితే.. కరోనా సోకిందని, ఐసొలేషన్‌లో ఉంచానని బుకాయించాడు. ఈ విషయాన్ని ఒకరు సనత్‌నగర్‌లోని మెట్రోపాలిటన్‌ న్యాయసేవా విభాగానికి చెందిన పుష్పలతకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె కలగజేసుకుని.. ఇంటికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ఆసుపత్రిలో పరీక్ష చేయించగా.. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. అనంతరం ఆమెను పుట్టింటికి పంపారు. ఆ తరువాత పోలీసులకు, కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోర్టు సూచనతో భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎట్టకేలకు అతను.. తప్పును సరిదిద్దుకుని భార్యను కాపురానికి తీసుకెళ్లాడు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని