తాజా వార్తలు

Published : 19/06/2021 01:38 IST
వర్షాకాలాన్ని ఎదుర్కొనే పద్ధతి ఇదేనా : భాజపా
జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న నేతలు

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: గత అనుభవాలను గుర్తించైనా, వర్షాకాల సమస్యలను ఎదుర్కొనేందుకు బల్దియా వేగంగా చర్యలు తీసుకోలేక పోతోందని భాజపా విమర్శించింది. నాలాల్లో పూడికతీత పనులు కూడా అరకొరగా సాగుతున్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వర్షాకాలంలో బల్దియా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ భాజపా నేతృత్వంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ వర్షాకాలం మొదలైనా, ఇంతవరకు నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాలేదన్నారు. వినతిపత్రం స్వీకరించడానికి కూడా బల్దియా కమిషనర్‌కు సమయం దొరకడం లేదని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాము జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వస్తున్నామని సమాచారం ఇచ్చినా, కమిషనర్‌ అందుబాటులో ఉండకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌, భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, శ్యాంసుందర్‌ గౌడ్‌, రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాయకులు మేకల సారంగపాణి, శ్రీధర్‌, సాయిసందీప్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని