తాజా వార్తలు

Published : 19/06/2021 00:47 IST
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

వెండి ఆభరణాలు స్వాధీనం

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఈ నెల 14వ తేదీన మోమిన్‌పేట మండలం ఎన్కతల శనైశ్ఛర ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6.2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నారాయణ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ మారుఫ్‌(32), రాయికోడ్‌ మండలం సింగోటానికి చెందిన మహ్మద్‌ ఖుద్దూస్‌(42), హైదరాబాద్‌ బండ్లగూడ, నూరినగర్‌కు చెందిన లారీ చోదకుడు మహ్మద్‌ ఖలీల్‌(36)లు అడవిలో, పొలం గట్లపై ఉన్న గంధం చెట్లను దొంగతనంగా నరికి అక్రమంగా విక్రయించుకునేవారు. ఈ క్రమంలో గంధం చెట్ల జాడ కోసం ముగ్గురు కలిసి మోమిన్‌పేట మండలం ఎన్కతలకు వచ్చారు. పగలంతా వాటి కోసం అన్వేషించి చీకటి పడగానే సమీపంలోని శనైశ్ఛరాలయం ఆవరణలో ఆశ్రయం పొందారు. లాక్‌డౌన్‌ కారణంగా పోలీసుల పహారా అధికం కావడంతో గంధం చెట్లను తరలించడం అసాధ్యంగా కనిపించింది. దీంతో వారి దృష్టి ఆలయంలోని వెండి ఆభరణాలపై పడింది. అనుకున్నదే తడువుగా ఈ నెల 14న రాత్రి గుడి బయట వేసిన తాళాన్ని విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామికి అలంకరించిన వెండి కిరీటాలు, ముత్యాల హారం, గొలుసులు, అభిషేకం పాత్రలు, ఆంజనేయస్వామి తొడుగు, తదితరాలు కలిపి మొత్తం 6.2 కిలోల వెండి సామగ్రిని అపహరించారు. ఈ విషయమై దేవాదాయశాఖ ఈఓ శేఖర్‌గౌడ్‌ మోమిన్‌పేట పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీఐ వెంకటేశం, ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పరిశోధించారు. చోరీ చేసిన ఆభరణాలను సదాశివపేట పట్టణంలోని శాస్త్రీ రోడ్‌లోని ఓ బంగారు దుకాణంలో శుక్రవారం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో డీఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు. ఈ కేసును 48 గంటల్లో ఛేదించిన సీఐ, ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుళ్లు గోపాల్‌, బాలునాయక్‌, రమేష్‌, నరేంద్ర, సతీష్‌, ఫారుఖ్‌, మల్లేశంగౌడ్‌లకు ఎస్పీ రివార్డు, ప్రశంసాపత్రాలను అందించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని