తాజా వార్తలు

Updated : 17/05/2021 09:24 IST
Corona: కరోనా పేరిట.. ప్రైవేటు ఆసుపత్రుల దందా!

ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు

దిక్కుతోచని స్థితిలో రోగులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా బాధితులను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. రూ.లక్షలు వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేమంటూ రోగి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా పెండింగ్‌ బిల్లు కట్టి పేషెంట్‌ను తీసుకెళ్లండంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాయి. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఆ ఆసుపత్రుల తీరు మారడం లేదు. కొవిడ్‌ సోకి పరిస్థితి విషమించడంతో నల్గొండకు చెందిన ఓ వ్యక్తిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఏప్రిల్‌ 15 నుంచి మే 13 వరకు చికిత్స అందించారు. రూ.23,65,000 బిల్లు వేశారు. అప్పటికే రూ.4.5 లక్షల బిల్లు కట్టేయగా మిగిలిన డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ తతంగమంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆసుపత్రి ఇచ్చిన బిల్లు కాగితం నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. విషయం వైద్యాధికారులకు చేరింది. అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం మరో నాటకానికి తెర తీసింది. విషయం బయటకు పొక్కకుండా రోగి కుటుంబ సభ్యులతో రాజీకొచ్చింది. ‘సాయంత్రం వచ్చి మాట్లాడుకోండి. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు వరకు తగ్గే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. విషయాన్ని మీడియాకు లీక్‌ చేయెద్దంటూ రోగి కుటుంబ సభ్యులను పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేసింది. చివరకు రోగి తరఫున న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో కథ అడ్డం తిరిగింది. కాళ్లబేరానికొచ్చిన ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా వైద్య ఖర్చులు తీసుకునేందుకు అంగీకరిస్తూనే.. ఉత్తరం రాయించుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది.’  
లక్షల్లో బిల్లు.. జేబుకు చిల్లు
ప్రభుత్వం జారీ చేసిన జీవో 248 ప్రకారం కొవిడ్‌ చికిత్స అందించే ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు ఐసీయూకు రూ.9,000, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7,000, సాధారణ వార్డుకు రూ.4,000 చొప్పున తీసుకోవాలి. కానీ నగరంలోని కొన్ని ఆసుపత్రులు ఐసీయూకు రూ.25,000 వసూలు చేస్తున్నాయి. ఇటీవలే తలాబ్‌కట్టకు చెందిన మహిళను కరోనాతో కాచిగూడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.4.10 లక్షలు కట్టారు. అదనంగా రూ.4.40 లక్షలు చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యం వేధించింది. ఇలా నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ జీవోను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రశ్నిస్తే మేం ఆక్సిజన్‌, పీపీఈ కిట్లు ఇతరత్రా వాటిని బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నామంటూ చెబుతున్నారు. ఆసుపత్రి బిల్లుతోపాటు
వైౖద్యుల సూచన మేరకు రెమ్‌డెసివిర్‌తోపాటు ఇతర ఇంజన్షన్లు బ్లాక్‌మార్కెట్లో ఒక్కో వయల్‌కు రూ.30 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని, ప్లాస్మా థెరపీకి అదనంగా వేలాది రూపాయలు ఖర్ఛు అవుతున్నాయని రోగుల బంధువులు వాపోతున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని