తాజా వార్తలు

Published : 14/05/2021 05:28 IST
సాధనతో యోగం

ఆన్‌లైన్‌లో ఆరోగ్యం..

 కొవిడ్‌ పరిస్థితుల్లో పెరుగుతున్న ఆసక్తి 

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌, చేగుంట

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే తొలుత మనం శక్తివంతులుగా మారాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగా వ్యాయామాలపై దృష్టి సారించాలి. ఇక ఆరోగ్య ప్రదాయిని యోగా.. అనేక సత్ఫలితాలకు కేంద్రంగా మారుతోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అత్యధికులు యోగాపై దృష్టి సారించడం విశేషం. ఆన్‌లైన్‌ తరగతులపై ఆసక్తి చూపుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి పట్టున ఉండే వారికి ఇవి ఉపయుక్తంగా మారాయి.

కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా విద్యా శాఖ ఆన్‌లైన్‌ మాధ్యమంగా ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని ప్రాణాయామం, ధ్యాన తరగతులను ప్రారంభించింది. రోగ నిరోధక శక్తిని పెంచుకొని తద్వారా అనారోగ్య సమస్యలు అధిగమించాలన్న లక్ష్యంతో సదరు కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన అంకురార్పణ చేశారు. మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించగా.. 19 వరకు కొనసాగనుంది. ఉపాధ్యాయులతో పాటు ఆసక్తి ఉన్న వారెవరైనా పాల్గొనే అవకాశం కల్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఉపాధ్యాయులు, ఆసక్తి ఉన్నవారు వినియోగించుకుంటున్నారు.

తొలిసారిగా..

ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా యోగా అసోసియేషన్‌ సహకారంతో ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి. నిత్యం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. రోజులో 1500 మంది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. యోగా శిక్షకుడు తోట సతీశ్‌.. సూక్ష్మ వ్యాయామం, ప్రాణాయామం, ధ్యాన సాధన చేయిస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ తరగతులకు సంబంధించిన వీడియోలను సిద్దిపేట విద్యా మిత్ర ఛానెల్‌లో (యూట్యూబ్‌) నిక్షిప్తం చేస్తున్నారు. వాటిని 5 వేల మందికి పైగా వీక్షిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు తరగతులు వినేందుకు విద్యా మిత్ర యూట్యూబ్‌ ఛానెల్‌ను వీక్షిస్తే ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. సెక్టోరల్‌ అధికారి డా. రమేశ్‌ పర్యవేక్షిస్తున్నారు. ‘తరగతులు ఆసక్తిగా సాగుతున్నాయి. తప్పక సత్ఫలితాలు ఇస్తాయి.’ అని యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తోట అశోక్‌, ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి కోరుతున్నారు.

సద్వినియోగం చేసుకోండి: డా. రవికాంత్‌రావు, సిద్దిపేట డీఈవో

శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడంతో పాటు అధికమొత్తంలో శరీరానికి ఆక్సిజన్‌ లభిస్తుంది. మానసిక ఒత్తిళ్లు అధిగమించడం సహా దృఢంగా మారేందుకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఉపాధ్యాయులతో పాటు ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. మంత్రి హరీశ్‌రావు హాజరై ప్రోత్సహించడం ఆనందంగా ఉంది.


గర్భిణులకు ప్రత్యేకంగా..

సంగారెడ్డిలోని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో యోగా, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏడాది కాలంలో 6 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు 250 మందికి పైగా యోగా నేర్చుకున్నారు. నిత్యం యోగా సాధనతో వైరస్‌ను తరిమికొట్టే తీరుపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నెల 16 నుంచి కొత్త బ్యాచ్‌ షురూ కానుండగా.. 22వ తేదీ కొనసాగనుంది. నిత్యం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. గర్భిణుల కోసం డివైన్‌ గర్భ సంస్కారం పేరిట ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఏడు రోజుల పాటు ఇది కొనసాగుతుంది. శిశువు, తల్లి ఆరోగ్యం, కాన్పు తర్వాత తీసుకోవాల్సిన ఆహారం, రాజయోగ అభ్యాసం ద్వారా మనసును సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుకునే అంశాలపై అవగాహన కల్పిస్తారు.

- న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ


ఆరోగ్య పరిరక్షణకు..

చేగుంటకు చెందిన అల్లి నరేష్‌ రెండు నెలలుగా ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు. రోజూ ఉదయం ఆసక్తి ఉన్నవారికి పలు ఆసనాలపై అవగాహన కల్పిస్తూ తనవంతుగా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనికి జూమ్‌ యాప్‌ను వేదికగా చేసుకున్నారు. నిత్యం 20 మంది వరకు ఆయా తరగతులకు హాజరవుతున్నారు. దీనికితోడు కొవిడ్‌ బారిన పడ్డ వారు చేయాల్సిన ఆసనాల గురించి వివరిస్తున్నారు. ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి వాటిని ఇటీవల యూట్యూబ్‌లోనూ నిక్షిప్తం చేశారు. దీన్ని మున్ముందు కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు.

- న్యూస్‌టుడే, చేగుంట


అవగాహన కల్పిస్తూ..

నర్సాపూర్‌లో భయాందోళన, ఒత్తిడిని జయించేందుకు అనుగుణంగా యోగాసనాలను ఉచితంగా నేర్పిస్తున్నారు శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన సురేందర్‌. ఆన్‌లైన్‌ వేదికగా సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఓడీఎఫ్‌లో ఉద్యోగం నిర్వర్తించి పదవి విరమణ పొందిన ఈయన కొన్నాళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో తరగతులు కొనసాగుతున్నాయి. ఏమైనా సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తూ ఆరోగ్యం చేకూర్చేలా అవగాహన కల్పిస్తూ ఆసనాలు వేయిస్తున్నారు. దీనికితోడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తున్నారు.

- న్యూస్‌టుడే, నర్సాపూర్‌


ప్రత్యేక శిబిరాలు..

సిద్దిపేటకు చెందిన వ్యాస మహర్షి యోగా సొసైటీ నిత్యం ఆన్‌లైన్‌లో యోగా తరగతులను ఏడాదిగా నిరంతరం నిర్వహిస్తోంది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ శిబిరాలు మొదలెట్టింది. ఇప్పటి వరకు 15 శిబిరాలు పూర్తయ్యాయి. సుమారు 3 వేల మంది వినియోగించుకున్నారు. పది మందితో మొదలవగా ప్రస్తుతం వందల సంఖ్యకు చేరింది. పలువురు ప్రముఖులూ సద్వినియోగం చేసుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 10 మంది న్యాయమూర్తులు ఆన్‌లైన్‌ తరగతులు వీక్షిస్తున్నారు. ఇదే క్రమంలో వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంపులో భాగంగా మిల్లెట్‌ రాంబాబుతో ఆహారపు అలవాట్లు, నియమాలు తదితర అంశాలపై, హైదరాబాద్‌కు చెందిన డా. బాలాజీతో ఆరోగ్య సంబంధిత అంశాలు, నిపుణులు వెంకట్‌, సురేశ్‌ సహకారంతో ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. వంటిల్లు ఔషధశాలగా మార్చుకునే చిట్కాలను చెబుతున్నారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. సిద్దిపేట వేదికగా శిక్షకులు సతీశ్‌, సంధ్య దంపతులు వీటిని నిర్వహిస్తున్నారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌


సామాజిక మాధ్యమం వేదికగా..

మహమ్మారి కారణంగా ఎంతో మంది శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించాలంటే యోగా ఓ దివ్యౌషధమని అంటారు వికారాబాద్‌లోని ఎల్‌ఐజీ కాలనీకి చెందిన యోగా శిక్షకులు నారాయణ్‌ రాథోడ్‌. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేంద్రానికి వెళ్లి ఒకే చోటికి చేరి ఆసనాలు వేయడం సాధ్యం కాకపోవడంతో ఈయన సామాజిక మాధ్యమాన్ని వేదికగా ఎంచుకున్నారు. సూర్యనమస్కారాలు, యోగా ఆసనాలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇంటి వద్ద ఉంటూ ప్రతి ఒక్కరూ సులభంగా చేసేలా తర్ఫీదు ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యం ఉదయం వేళ కొంతమందికి నేర్పిస్తున్నారు.

- న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని