తాజా వార్తలు

Published : 14/05/2021 05:28 IST
కారు బోల్తా.. బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

శ్రీనికేతన్‌గౌడ్‌

వెల్దుర్తి, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా వాహనం బోల్తా పడి ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ మహేందర్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెల్దుర్తి గ్రామానికి చెందిన నాలచెరువు శ్రీనికేతన్‌గౌడ్‌ (19), కె.పి.తనీశ్‌, పొన్నం వికాస్‌ కలిసి తమ స్నేహితుని కారు తీసుకొని సరదాగా ప్రయాణిస్తున్నారు. మన్నెవారిజలాల్‌పూర్‌-మంగళపర్తి గ్రామాల మధ్య కారు అదుపు తప్పి బోల్తా పడింది. వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. శ్రీనికేతన్‌గౌడ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను హైదరాబాద్‌ బాచుపల్లిలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నాలచెరువు శ్రీనివాస్‌గౌడ్‌, గీత దంపతుల ఇద్దరు సంతానంలో శ్రీనికేతన్‌ ఒకడే కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందారు. స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని