తాజా వార్తలు

Published : 14/05/2021 02:28 IST
సంక్లిప్త వార్తలు

రుణం రాలేదని బలవన్మరణం

అల్వాల్‌, న్యూస్‌టుడే: బ్యాంకు రుణం రాలేదన్న బెంగతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్వాల్‌ ఎస్సై నవీన్‌ కథనం ప్రకారం.. ఓల్డ్‌ అల్వాల్‌లోని చైతన్య హౌసింగ్‌ సొసైటీలో నివసించే శ్రీనివాస్‌రెడ్డి(40) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భార్య, పిల్లలతో కలిసి సొంతింటిలో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఇంటి పైన రెండో అంతస్తు నిర్మించాల్సి రావడంతో బ్యాంకు రుణానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలకుతోడు బ్యాంకు రుణం రాలేదన్న కారణంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది అదృశ్యం

జూబ్లీహిల్స్‌, సైదాబాద్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌, సైదాబాద్‌ పోలీసు ఠాణాల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది అదృశ్యమైనట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. వీరిలో ఓ కానిస్టేబుల్‌ కుమార్తె; మాజీ సైనికాధికారి భార్య, ఆయన ముగ్గురు పిల్లలు; కొత్తగా పెళ్లయిన ఓ యువతి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.. ఎస్సైలు శేఖర్‌, సారంగపాణిల కథనం ప్రకారం.. కార్మికనగర్‌లో మాజీ సైనికాధికారి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి పదేళ్లుగా నివసిస్తున్నారు. ఈనెల 8న మద్యం విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగి సద్దుమణిగింది. బుధవారం ఉదయం భర్త నడకకు వెళ్లాడు. 8.25 గంటల ప్రాంతంలో తిరిగి రాగా భార్య(36), చిన్నారులైన ముగ్గురు కుమార్తెలు కనిపించలేదు.

యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్‌ క్వార్టర్స్‌లో నివసించే హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తె(19) బీఏ చదువుతోంది. మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమె చరవాణి సైతం అందుబాటులో లేదు.

యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే కనగల సాయికుమార్‌(27) ప్రైవేట్‌ ఉద్యోగి. 2019లో వివాహమైంది. మూడు నెలలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న దంపతుల మధ్య చరవాణి విషయంలో ఈనెల 6న గొడవ జరిగింది. 7వ తేదీన పాల ప్యాకెట్లు తీసుకురావడానికి అతను వెళ్లి వచ్చేసరికి భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

చంపాపేట డివిజన్‌ రెడ్డికాలనీ సమీపంలో ఓ మహిళ(34) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. భర్త ప్రభుత్వ సంస్థలో కార్మికుడు కాగా.. ఆమె పారిశుద్ధ్య కార్మికురాలు. ఈనెల 9న తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగి రాలేదు.

ఐఎస్‌సదన్‌ డివిజన్‌ వినయనగర్‌ కాలనీకి చెందిన యువతి(25) ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచే విధులకు హాజరవుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు గుడికెళుతున్నానంటూ తల్లికి చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోడంతో కుటుంబీకులు ఆమెకు ఫోన్‌ చేయగా.. కొద్దిసేపటిలోనే వస్తానని చెప్పింది. ఎంతకీ రాకపోవడంతో తిరిగి మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్‌ ఆపేసి ఉంది. ఆమె స్నేహితురాలికి యువతి తండ్రి ఫోన్‌ చేయగా.. రెండురోజుల్లో తిరిగి వస్తానంటూ తనకు సందేశం పంపినట్లు బదులిచ్చింది. ఆయన పోలీసులను ఆశ్రయించారు.


గ్రేటర్‌లో 734 కేసులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో కొత్తగా కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య కంటే రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారు, స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారిలో చాలామంది మనో నిబ్బరంతో మహమ్మారిని జయిస్తున్నారు. ప్రస్తుతం 88.42% మంది వైరస్‌ను జయిస్తుండగా.. కేవలం 0.55% ఇతర అనుబంధ వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్లు తేల్చింది. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 734 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 285, రంగారెడ్డి జిల్లా పరిధిలో 296 కేసులు నమోదయ్యాయి. ఈ వారం రోజుల వ్యవధిలో ఇదే తక్కువ కావడం గమనార్హం.


51,178 ఇళ్లలో జ్వరం సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా తలపెట్టిన జ్వరం సర్వే గురువారం 51,178 ఇళ్లలో జరిగినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. నర్సు, ఆశా కార్యకర్త, బల్దియా సిబ్బందితో కూడిన 709 బృందాలు కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.


అన్నార్తుల పాలిట ‘అన్నపూర్ణ’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో నిరాశ్రయులు, కూలీలు, యాచకులు ఆహారం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా రూ.5 భోజనం పెడుతున్న అన్నపూర్ణ కేంద్రాలకు అదనంగా మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ప్రారంభించిన వీటి ద్వారా రోజూ 45 వేల మంది ఆకలి తీర్చడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.


నిమ్స్‌ అత్యవసర విభాగం మార్పు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నేపథ్యంలో పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రి అత్యవసర విభాగాన్ని మార్పు చేశారు. బంజారాహిల్స్‌ ప్రధాన రహదారి ద్వారం వైపు ఉన్న భవానాన్ని ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డు కోసం కేటాయించారు. దీంతో అత్యవసర విభాగాన్ని పాత భవనంలోని ఐసీయూకు మార్చారు. అయితే ఈ విభాగంలో పడకల సామర్థ్యం తగ్గింది. ఇంతకు ముందున్న బ్లాక్‌లో 80 పడకల సామర్థ్యం ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు వస్తే వెంటనే చేర్చుకొని వైద్యం అందించేవారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం 16 పడకలను కేటాయించారు.


మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ పరిధిలో నిరుద్యోగ యువతీ, యువకులకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణను ఇస్తున్నట్లు నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి నిరంజన్‌ తెలిపారు. 2018-20లో బీటెక్‌, ఎంటెక్‌, బీఎస్సీ, ఎంసీఏ కంప్యూటర్‌ ఉత్తీర్ణులైన వారికి డాట్‌ నెట్‌ కోర్సులైన సి.నెట్‌, ఏఎస్‌పీ.నెట్‌, ఏడీఓ.నెట్‌, హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, ఎస్‌క్యూఎల్‌.సర్వర్‌, జావా స్క్రిప్ట్‌, ఎక్స్‌ఎంఎల్‌+ఎక్స్‌ఎస్‌ఎల్‌టీ, జేక్వైరీ, సాఫ్ట్‌ స్కిల్స్‌, వర్క్‌ప్లేసెస్‌ రెడీనెస్‌, విత్‌ రియల్‌టైమ్‌, వెబ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులైన ఆంగ్లర్‌ జేఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, బూట్స్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, జావా స్క్రిప్ట్‌, మై ఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ, సాఫ్ట్‌ స్కిల్స్‌, డబ్ల్యుపీఆర్‌లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈనెల 20 లోపు https://bit.ly/ RegistrationLinkFRYSP ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు: 9100810928


కింగ్‌కోఠిలో ప్రత్యేక పడకలు.. కాన్సన్‌ట్రేటర్లతో ప్రాణవాయువు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లినా కూడా పడకలు లేవంటున్నారు. ఆయాసం ఎక్కువై.. సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరైతే పడకలు ఖాళీ అయ్యే వరకు అంబులెన్స్‌లో ఉండి ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలోని ట్రయేజ్‌ విభాగంలో రెండు గదుల్లో ప్రత్యేకంగా పది పడకల వరకు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఆటోల్లో వచ్చే కొవిడ్‌ బాధితులకు అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా వార్డుల్లో పడకలు ఖాళీ అయ్యేంత వరకు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లోని పడకలపై ఉంచి, ‘ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల’ ద్వారా ప్రాణవాయువు అందిస్తున్నారు. ఇవి చిన్నపాటి సూట్‌కేస్‌ తరహాలో ఉంటాయి. ఎవరైనా సులువుగా మోసుకెళ్లే అవకాశం ఉండటంతో వీటిని ప్రత్యేక వార్డులో ఉన్న మంచాలకు గొలుసులతో కట్టేశారు.


గాంధీ రోగుల సహాయకులకు పోలీసుల వసతి

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రెండోరోజు లాక్‌డౌన్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు సాధారణ కార్యకలాపాలకు సమయం ఉండడంతో గురువారం ఉదయం నుంచే తమ పనులు పూర్తిచేసుకునేందుకు ప్రజలు ఉరుకులు పరుగులతో బయటకు వచ్చారు. గురువారం చాలా ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనిపించింది. కార్యాలయాలు, ఆసుపత్రులు అధికంగా ఉన్న ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ అమీర్‌పేట, మాదాపూర్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా కనిపించాయి. లాక్‌డౌన్‌ వెసులుబాటు నాలుగు గంటలు మాత్రమే ఉండడంతో చాలామంది వ్యాపారులు, చిన్న,చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ఈనెల 21 వరకు హోటళ్లు తెరవబోమంటూ ప్లకార్డులు ఏర్పాటు చేశారు.మరోవైపు లాక్‌డౌన్‌ అమలుతీరును హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ట్యాంక్‌బండ్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో పరిశీలించారు. రంజాన్‌ సందర్భంగా శుక్రవారం ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని అభ్యర్థించారు. గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌బారిన పడి కోలుకుంటున్న వారి కుటుంబసభ్యులు, సహాయకులకు పోలీసులు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పించారు. గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న భవనంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వసతి కల్పించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని