తాజా వార్తలు

Updated : 14/05/2021 05:06 IST
చిత్ర వార్తలు

భువికి దిగిన నెలవంక

రంజాన్‌ పర్వదినం సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు అందంగా అలంకరించిన చంద్రవంక ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

-న్యూస్‌టుడే, శంషాబాద్‌


పోలీసుల చేయూత

 

పాపం నిండు గర్భిణి.. హైటెక్‌ సిటీ ప్రాంతం నుంచి ఉదయాన్నే కోఠి ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. ప్రసవానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉందని వైద్యులు చెప్పారు. దాంతో మళ్లీ ఇంటి దారి పట్టే సమయానికి లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిస్సహాయంగా నడిరోడ్డుపై నిలిచిపోయిన ఆమెను అక్కడ విధుల్లో ఉన్న స్థానిక సీఐ వివరాలు అడిగి కనుక్కొన్నారు. స్వయంగా ఆటో మాట్లాడి ఆమెను ఇంటికి పంపే ఏర్పాటు చేశారు. మధ్యలో ఎవరైనా ఆపితే తనకు ఫోన్‌చేయాల్సిందిగా నంబరు కూడా ఇచ్చారు.


చెట్టు నీడే గూడు.. పచ్చగడ్డే పాన్పు

లాక్‌డౌన్‌తో అటు వ్యాపారాలు.. ఇటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడడంతో  ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది. పొట్ట చేతపట్టుకొని నగరానికి వచ్చిన వలస కూలీలు ఊరికి వెళ్లలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక చాలామంది అద్దె ఇళ్లను ఖాళీ చేశారు.  బ్యాగులు భుజాన వేసుకొని లుంబినీ పార్కు ముందు ఉన్న ఉద్యానంలో ఇలా  సేదతీరుతూ కనిపించారు.


ఈద్‌ ఉల్‌ ఫితర్‌ ఘర్‌ మే హీ బెహతర్‌

రంజాన్‌ పండుగ నేపథ్యంలో గురువారం పాతబస్తీలోని దుకాణాలు కిక్కిరిసి కనిపించాయి. శుక్రవారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ఇందుకోసం ముందురోజే పెద్దఎత్తున కొనుగోళ్ల కోసం బయటకు వచ్చారు. ఉదయం 10 గంటల వరకు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని చిన్నా, పెద్దా దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడాయి.


నిఘా కళ్లు గప్పి రయ్‌..రయ్‌..

ఖమ్మం నగరంలో కొందరు యువకులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. పరిమితికి మించి, వేగం పెంచి, తగిన పత్రాలు లేకుండా దూసుకెళ్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా నెంబరు ప్లేట్లను మూసేసి రయ్‌మంటున్నారు. లాక్‌డౌన్‌ వేళ ఖమ్మం బస్టాండు ప్రాంతంలో గురువారం ఓ యువకుడు పోలీసుల కళ్లు గప్పేలా నెంబర్‌ ప్లేటును చేతితో మూసి ద్విచక్రవాహనంపై ఉడాయిస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ ఛాయాగ్రాహకం క్లిక్‌మన్పించింది.

-ఈనాడు, ఖమ్మం


ప్రయాణ పాట్లు

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు ఉదయం 10 గంటల వరకే రోడ్లపై తిరుగుతున్నాయి. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం, తాము వెళ్లే ప్రాంతాలకు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఖమ్మం బస్టాండు బయటకు వచ్చి ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎండలు మండుతున్నా గమ్యస్థానం చేసేందుకు రోడ్డు పక్కనే వేచిఉంటున్నారు. ఆ రూట్‌లో ఎలాంటి వాహనం వచ్చినా ఆపుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి రెండురెట్ల ఛార్జీలను వసూలు చేస్తున్నారు. తమకు భారమైనా గమ్యస్థానం చేరేందుకు వాటిని ఆశ్రయించక తప్పడంలేదు.

-ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే


ఎడ్లబండిపై గిడ్డంగికి..

మిరప ధరలు పూర్తిగా పడిపోవడంతో చాలా మంది రైతులు దిగుబడులను శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు. అక్కడ కూడా రోజుల తరబడి ఉండాల్సి రావడంతో కొన్నిచోట్ల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు రావడం లేదు. వచ్చినా వేచి ఉండేందుకు ఎక్కువ కిరాయి తీసుకోవడంతో ప్రత్నామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. సమీప గ్రామాల రైతులు ఎడ్లబండ్లపై బస్తాలు తరలిస్తున్నారు. జన్నారం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింహారావుపేటకు ఎడ్లబండ్లపై మిరప బస్తాలను ఎడ్లబండ్లపై తీసుకెళ్తున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

- ఏన్కూరు, న్యూస్‌టుడే


అన్నమో ..రామచంద్రా


వైరా రోడ్‌లో అంధుడి అవస్థ

ఎవరైనా దయతలిస్తేనే వారి కడుపు నిండుతుంది. అలాంటి అభాగ్యులకు కరోనా మహమ్మారి క్షుద్బాధ మిగులుస్తోంది. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఖమ్మంలో దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. జనం రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. నా అన్నవాళ్లు లేని నిరాశ్రయులు అన్నమో రామచంద్ర అంటూ అర్థిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అంధులు, అనారోగ్యంతో నీరసించిన వారు రైల్వేస్టేషన్‌, బస్టాండు, దుకాణాల ఎదుట తలదాచుకుంటున్నారు. వారికి ఆహార పొట్లాలు ఇచ్చేవారు కరవయ్యారు. అధికారులు మానవతాదృక్పథంతో ఆలోచించి వారికి తాత్కాలిక వసతి కల్పించాల్సిన అవసరముంది. ఖమ్మం నగరంలో గురువారం కన్పించిన దృశ్యాలివి.

బస్టాండులో ఓ దుకాణం ఎదుట నీరసించిన వృద్ధుడు

రైల్వేస్టేషన్‌లో అభాగ్యుల అవస్థలు

- ఈనాడు, ఖమ్మం


నాటించిన చేతులే నరికిస్తున్నాయి..

గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధిలో ముందుచూపు లేకుండా చేపట్టిన ‘హరితహారం’ ఫలితం ఇది. వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు పట్టణంలో ప్రధాన రహదారికి రెండు వైపులా గతంలో మొక్కలు నాటించారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరగడంతో పైనున్న విద్యుత్తు తీగలకు తగులుతున్నాయి. దీంతో సరఫరాకు అంతరాయం కలుగుతోందని చెట్ల కొమ్మలను నరికిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

- న్యూస్‌టుడే, గజ్వేల్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని