తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
కలివిడిగా నిలబడి.. కరోనా కట్టడి!


రెయిన్‌బో విస్టాస్‌ సముదాయం

ఈనాడు, హైదరాబాద్‌: వేలాది కుటుంబాలు ఒకే సముదాయంలో నివాసం.. నిత్యం వందల మంది రాకపోకలు.. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారి పడగ విప్పడంతో పదుల సంఖ్యలో వైరస్‌ బారినపడ్డారు. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోలేదు.. అందరూ కలిసికట్టుగా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. తోటి నివాసితుల సహాయ సహకారాలతో దాదాపుగా చాలామంది ఆసుపత్రి అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకున్నారు. నగరంలో మూసాపేట సమీపంలోని రెయిన్‌బో విస్టాస్‌ నివాసిత సముదాయం స్ఫూర్తి ప్రస్థానమిది. రెయిన్‌బో విస్టాస్‌ సముదాయంలోని 12 టవర్ల (అపార్టుమెంట్ల)లో 19 అంతస్తుల చొప్పున ఇళ్లు ఉన్నాయి. దాదాపు 2300 కుటుంబాలు ఉంటున్నాయి. కరోనా రెండోదశ మొదలయ్యాక వరుసగా పెద్దసంఖ్యలో నివాసితులు మహమ్మారి బారినపడ్డారు. మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో వారందరూ ఐక్యంగా నిలిచి మహమ్మారిని ఎదుర్కొంటున్నారు.

ఆహార సరఫరాకు బృందం

కొవిడ్‌ కుటుంబాలకు ఆహారం అందించేందుకు తోటి నివాసితులతో 40 మంది వాలంటీర్లతో కూడిన ఫుడ్‌ సేవ బృందాన్ని ఏర్పాటు చేశారు. టిఫిన్‌ భోజనం సిద్ధం చేసి నిర్దేశిత సమయానికి ప్యాకింగ్‌ చేసి వాలంటీర్‌ తన ఇంటి బయట ఉంచుతారు. దాన్ని భద్రత లేదా హౌస్‌కీపింగ్‌ సిబ్బంది తీసుకుని బాధితుల ఇళ్ల వద్ద ఉంచుతారు.

చర్యలు ఇలా..

* మహమ్మారిపై పోరులో రెయిన్‌బో విస్టాస్‌ స్ఫూర్తి ● బాధితులకు తోటి నివాసితుల నుంచి ఆహారం

* అనుమానితులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు వీలుగా మేనేజ్‌మెంట్‌ కమిటీ మూడు ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని రోజూ విడిచి రోజూ 40-50 మందికి పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఐసొలేటెడ్‌ ప్రాంతాన్ని కేటాయించారు.

* కుటుంబంలో ఎవరైనా ఒకరికి కొవిడ్‌ నిర్ధారణ అయితే అందరినీ రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండేలా నిబంధన విధించుకున్నారు.

* రోజుకు 7-8 సార్లు లిఫ్టులను, మూడుసార్లు కొవిడ్‌ బాధితులున్న ఫ్లోర్‌ను శానిటైజ్‌ చేయిస్తున్నారు.

* హౌస్‌కీపింగ్‌, ఇతర సిబ్బంది వైరస్‌ బారినపడితే ఆర్థిక సాయం అందిస్తున్నారు.

కోలుకునే వరకు సాయం

- జి.నాగేంద్రబాబు(అధ్యక్షుడు), శ్రీరామ్‌ ఆకెళ్ల(ఉపాధ్యక్షుడు), రెయిన్‌బో విస్టాస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ

ఎవరైనా నివాసితుడికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యిందని కమిటీ దృష్టికి తీసుకురాగానే ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ చేసి వారి ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నాం. శానిటేషన్‌ మొదలుకుని వైద్య సాయం వరకు సహకారం ఇస్తున్నాం. తోటి నివాసితులు అందిస్తున్న సహకారంతో బాధితులందరూ దాదాపుగా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండి కోలుకుంటున్నారు. గతంలో 200వరకు ఉన్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు 133కు తగ్గాయి.

ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు యత్నిస్తున్నాం

- మధుసూదన్‌రెడ్డి, మేనేజ్‌మెంట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు

మేనేజ్‌మెంట్‌ కమిటీ తరఫున ప్రత్యేకంగా కొవిడ్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. బాధితులకు అవసరమైన వైద్య, ఇతర సౌకర్యాలు అందిస్తుంటారు.త్వరలోనే ఏదైనా ఆసుపత్రి భాగస్వామ్యంతో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకు ంటున్నాం. దీనివల్ల బాధితులకు ఆక్సిజన్‌ సదుపాయం పొందే వీలు కలగనుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని