తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
ఖాతాలోంచి రూ.20 లక్షలు మాయం

నారాయణగూడ, న్యూస్‌టుడే: తన ప్రమేయం లేకుండా తన ఖాతాలోంచి రూ.20 లక్షలు మాయమయ్యాయంటూ ఓ వయోధికుడు అమెరికా నుంచి నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. డి.డి.కాలనీకి చెందిన శ్రీనివాసమూర్తికి ఎస్‌బీఐ అంబర్‌పేట్‌ శాఖలో ఖాతా ఉంది. కొంతకాలం క్రితం అమెరికాలో ఉన్న తన కూతురు దగ్గరకు వెళ్లారు. రెండు రోజుల క్రితం తన బ్యాంక్‌ ఖాతాను పరిశీలిస్తుండగా రూ.20 లక్షలు గల్లంతైనట్లుగా గుర్తించారు. మార్చి 3వ తేదీ నుంచి విడతల వారీగా దోచేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.

వ్యాక్సిన్‌ ఇప్పిస్తానని రూ.1.10 లక్షలు స్వాహా

మీకు, మీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్‌ ఇస్తామని.. రూ.1.10 లక్షలు దోచేశారని మరోఫిర్యాదు అందింది. ఫిలింనగర్‌కు చెందిన కల్యాణ్‌ శ్రీనివాస్‌ నగరంలోని ఓ సంస్థకు డైరెక్టర్‌. రెండు రోజుల క్రితం కృష్ణారావు అనే వ్యక్తి ఆయనకు ఫోన్‌ చేసి ‘తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారిని.. మీకు, మీ సంస్థలోని ఉద్యోగులకు మేమే వచ్చి వ్యాక్సిన్‌ వేసి వెళ్తామని చెప్పాడు. రూ.1.10 లక్షలు బదిలీ చేస్తే రేపే వచ్చి వ్యాక్సిన్లు వేస్తామని నమ్మించాడు. ఇదంతా నిజమే అనుకుని ఆ వ్యక్తి చెప్పిన ఖాతాకు రూ.1.10 లక్షలు బదిలీ చేశాడు బాధితుడు. తర్వాత మోసగాడి ఫోన్‌ పలకడం మానేసింది. మోసపోయానని గ్రహించి బాధితుడు ఫిర్యాదు చేశారు.

కేబీసీ లాటరీ వచ్చిందని రూ.1.68 లక్షలు

కేబీసీ లాటరీ వచ్చిందని నమ్మించి రూ.1.68 లక్షలు కొట్టేశారంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేశారు. పాతబస్తీకి చెందిన షాహెదా బేగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి.. తాను కేబీసీ కార్యక్రమ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. ‘జాతీయస్థాయిలో తాము కొందరి ఫోన్‌ నంబర్లతో లాటరీ నిర్వహించాం.. అందులో మీరు రూ.25 లక్షలు గెలుచుకున్నార’ని నమ్మించాడు. అయితే, ఆ సొమ్ము మీకు చేరాలంటే ఇన్‌కంటాక్స్‌, జీఎస్టీ కింద రూ.1.68 లక్షలు చెల్లించాలని చెప్పాడు. బాధితురాలు మోసగాడు చెప్పిన ఖాతాకు రూ.1.68 లక్షలు బదిలీ చేసేశారు. తర్వాత అవతలి వ్యక్తి ఉలుకు పలుకు లేదు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని