తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
నకిలీ క్రెడిట్‌ మెసేజ్‌లతో నగల వ్యాపారులకు బురిడీ


నిందితుడు సుబ్రహ్మణ్యం

నాగోలు, న్యూస్‌టుడే: నకిలీ క్రెడిట్‌ మెసేజ్‌లతో నగల వ్యాపారులను బురిడీ కొట్టించి సొమ్ముచేసుకుంటున్న యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ కథనం ప్రకారం... ఏఎస్‌రావ్‌ నగర్‌కు చెందిన బుధానర్స సుబ్రహ్మణ్యం(26) ఈసీఐఎల్‌ ప్రాంతంలో స్థిరాస్తి ఏజెంట్‌గా చలామణి అవుతున్నాడు. కొన్నాళ్లుగా అతడు జల్సాలకు అలవాటుపడ్డాడు. కరోనా ప్రభావంతో వ్యాపారం సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన ఖర్చుల కోసం సులువుగా సంపాదించేందుకు ఇంటర్‌నెట్‌లో బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ పద్ధతిని తెలుసుకున్నాడు. వాటి సాయంతో అక్రమాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. తన తెలివిని సైతం జోడించి నగదు జమచేసినట్లు తెలిపే ఫేక్‌ క్రెడిట్‌ మెసేజ్‌లను సృష్టించాడు. ఈ క్రమంలో కొన్ని నగలదుకాణాలను ఎంచుకుని భార్య, పిల్లలతో సహా వెళ్లి తులంలోపు బంగారం కొనుగోలు చేస్తాడు. తన పర్సులోని నగదు లెక్కించి తక్కువగా ఉన్నాయంటూ ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లిస్తానంటాడు. వారి నంబరుకు నగదు జమచేసినట్లు నకిలీ క్రెడిట్‌ మెసేజ్‌ పంపుతాడు. నిర్వాహకులు దాన్ని నిజమని నమ్మి ఆ ఆభరణాన్ని అతనికి ఇచ్చేయడంతో కుటుంబంతో సహా అక్కడినుంచి పరారవుతాడు. ఇలా ఓ వ్యాపారి తన బ్యాంకు స్టేట్‌మెంట్‌ చూసి సదరు చెల్లింపు జరగలేదని గమనించి.. మోసపోయినట్లు గ్రహించాడు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆపై సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలోనూ ఇలాంటి కేసులు కుషాయిగూడ, జవహర్‌నగర్‌ ఠాణాల్లో నమోదైనట్లు సీఐ తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని