తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
చికిత్సకు సాయం చేయండంటూ వంచన

రూ.22 లక్షలకు టోకరా

రాయదుర్గం, న్యూస్‌టుడే: తమ ఆప్తుల చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలంటూ విదేశాల్లోని స్నేహితులు, బంధువుల పేరిట వాట్సప్‌ సందేశాలు పంపించి సైబర్‌ మోసగాళ్లు.. ఇద్దరు బాధితుల నుంచి రూ.22 లక్షలు కాజేశారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన శ్రీరాంకు బుధవారం అమెరికాలో ఉండే తన వరుస సోదరి సుజాత పేరిట వాట్సప్‌ సందేశం వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి చికిత్సకు డబ్బులు అవసరం ఉందని, వెంటనే పంపించాలని, బ్యాంకు ఖాతా నంబరుతో సహా అందులో ఉంది. నమ్మిన ఆయన వెంటనే రూ.10.98 లక్షలు ఖాతాలో జమ చేశారు. తన సోదరికి ఫోన్‌ చేసి ఆరా తీయగా తాను సందేశం పంపించలేదని, తన వాట్సప్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్పడంతో అవాక్కయి పోలీసులను ఆశ్రయించారు.

మరో ఘటనలో.. కూకట్‌పల్లిలో నివసించే నరేంద్రకు ఈనెల 10న అమెరికాలో ఉండే తన స్నేహితుడు రవి శ్రీనివాస్‌ పేరిట వాట్సప్‌ సందేశం రావడంతో రూ.10.98 లక్షలు పంపారు. 11న స్నేహితుడికి ఫోన్‌ చేయగా తన వాట్సప్‌ హ్యాక్‌ అయిందని చెప్పారు. గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల మోసగాళ్లు, అమెరికాలో నివసించే భారతీయుల చరవాణి నంబర్లను హ్యాక్‌ చేయడం అధికమైందని సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు. ప్రజలు అలాంటి సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని, సందేశాలు పంపించిన వారిని సంప్రదించకుండా డబ్బులు వేయకూడదని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని