తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
అయిదేళ్లలో వంద బాల్యవివాహాలకు అడ్డుకట్ట

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌

నాగోలు, న్యూస్‌టుడే: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పడిన అయిదేళ్ల వ్యవధిలో 100 బాల్యవివాహాలను అడ్డుకొని బాధితులైన బాలికలకు పునర్జన్మ ప్రసాదించిన షీ బృందాలను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు. గురువారం ఎల్బీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సీపీ విలేకరులతో మాట్లాడుతూ.. ఛైల్డ్‌లైన్‌, అంగన్‌వాడీ, స్వయంసహాయక సంఘాల మహిళల సహకారంతో షీ బృందాలు ఇప్పటివరకు 100 బాల్యవివాహాలను నిరోధించాయన్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలున్న నేపథ్యంలో సరైన అవగాహన లేక నేటికీ ఈ సాంఘిక దురాచారం కొనసాగుతోందన్నారు. 2017 నుంచి నేటివరకు భువనగిరి జోన్‌ షీ బృందాల ఆధ్వర్యంలో 43 బాల్యవివాహాలను అడ్డుకోగా, చౌటుప్పల్‌ షీటీమ్స్‌ ఆధ్వర్యంలో 25, ఇబ్రహీంపట్నంలో 12, కుషాయిగూడలో 5, ఎల్బీనగర్‌లో 3, మల్కాజిగిరిలో 8, వనస్థలిపురంలో 4 పెళ్లిళ్లను నిలిపివేశారని వెల్లడించారు. తాము రక్షించిన అనూష అనే బాలిక తదనంతరం జాతీయస్థాయి క్రికెట్‌ పోటీల్లో ఎంపికై ప్రతిభ చూపడం షీ బృందాల పనితీరుకు నిదర్శనమన్నారు. షీటీమ్స్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న అదనపు డీసీపీ సలీమాను సీపీ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, క్రైమ్‌ డీసీపీ యాదగిరి పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని