తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
ఉద్యోగం ఉందన్నాడు.. రూ.2.5 లక్షలు ఊదేశాడు

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఉద్యోగం పేరుతో నమ్మించి రూ.2,52,383 మోసగించిన ఘటన పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకొంది. సీఐ ఎస్‌.రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్‌ రాఘవేంద్రకాలనీకి చెందిన శ్వేత పటాలే(30) ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం అన్వేషిస్తోంది. ‘మీకు ఉద్యోగ అవకాశం ఉంది’ అని బుధవారం సాయంత్రం ఆమెకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రైవేట్‌ టెలికాం సంస్థల్లో ఆపరేషన్‌ మేనేజరుగా పని చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపాడు. ఇందుకోసం జాబ్‌ పోర్టల్‌ సభ్యత్వం తీసుకోవాలని, రూ.10 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి తాము పంపిన లింక్‌లో లాగిన్‌ కావాలని సూచించాడు. ఆమె అందులో లాగిన్‌ అయ్యి వివరాలు నమోదు చేశారు. రూ.10 ఆన్‌లైన్‌ ద్వారా పంపినా వెళ్లలేదని సమాచారం వచ్చింది. అనంతరం రూ.21,198 యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆమె డబ్బులు తిరిగి పంపించమని ఫోన్‌ చేసిన వ్యక్తిని అడిగారు. సాంకేతిక కారణాల వల్ల బ్యాంక్‌ లావాదేవీలు పనిచేయడం లేదని.. వేరే బ్యాంకు ఖాతా ఇస్తే పంపిస్తానని అతను చెప్పాడు. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతా వివరాలు అతడికి ఇవ్వగా.. కొద్దిసేపట్లోనే ఆ ఖాతా నుంచి రూ.10,100 డ్రా అయ్యాయి. వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు వేస్తానని ఓటీపీ అడిగాడు. ఓటీపీ అతడికి తెలియజేయటంతో ఆమె ఖాతా నుంచి రూ.20,099 డ్రా అయ్యాయి. ఇలా మొత్తం విడతలవారీగా రూ.2,52,383 రెండు బ్యాంకు ఖాతాల నుంచి కొట్టేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గురువారం పేట్‌బషీరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని