తాజా వార్తలు

Updated : 25/02/2021 07:25 IST
బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం

భర్తకు తీవ్రగాయాలు

ప్రమాదం జరిగిన ప్రాంతం

నారాయణగూడ, న్యూస్‌టుడే: మరోమారు తల్లిదండ్రులం కాబోతున్నామన్న వారి ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. కడుపులో బిడ్డా దూరమయ్యాడు. దాదాపు 8 గంటలపాటు మృత్యువుతో పోరాడిన ఆ తల్లి కళ్లు మూసింది. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన చూసిన అందరి కళ్లు చెమ్మరిల్లాయి. నారాయణగూడ ఠాణా పరిధిలో బుధవారం రోడ్డుప్రమాదంలో చోటుచేసుకున్న విషాదమిది. ఉదయం 9:45 గంటలకు హిమాయత్‌నగర్‌ వైజంక్షన్‌లో సిగ్నల్‌ పడింది. అన్ని వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సు కూడా పరుగులు పెడుతోంది. ఇంతలోనే వై.జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ వీధి నెంబరు 9కి వెళ్లే దారిలో ముషీరాబాద్‌ డిపో బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనంపై ఉన్న గర్భిణి, ఆమె భర్త పడిపోయారు. బస్సు అలాగే ముందుకు పోవడంతో పెద్దపెట్టున కేకలు వినపడగా ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. బస్సు వెనుక చక్రాల కింద గర్భిణి, భర్త కుడివైపు పడి ఉన్నారు. స్థానికులంతా గగ్గోలు పెట్టడంతో వెంటనే డ్రైవర్‌ కమలన్న బస్సును వెనక్కు తీశాడు. ఆ మహిళ అప్పటికే అపస్మారక స్థితిలో ఉంది. బస్సు వెనక చక్రాలు ఆమె కడుపుపైకి ఎక్కడంతో రక్తం వరదలై పారింది. ఆమె పొట్ట భాగం నుజ్జయింది. అటుగా వెళ్తున్న అంబులెన్స్‌లోకి ఆమెను ఎక్కించి హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. 108లో ఆమె భర్తను కూడా పంపించారు. ఘటనాస్థలిలో దొరికిన వైద్య నివేదిక ఆధారంగా దంపతులు ముషీరాబాద్‌ బాకారంలో ఉండే పి.శాలిని (35), సతీష్‌ గౌడ్‌ (36)గా గుర్తించారు. శాలిని 6 వారాల గర్భిణి. ఉదయం 8:30 గంటలకు హైదర్‌గూడలోని ఫెర్నాండెజ్‌ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. దంపతులకు ఏడాది కొడుకు ఉన్నాడు. ఆసుపత్రిలో ఆ తల్లి 8 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. భర్త చికిత్స పొందుతున్నాడు.


శాలిని, సతీష్‌గౌడ్‌

బతుకుతుందేమో అనుకున్నా..

బస్సు చక్రాలు తన కడుపుపైకొచ్చినప్పుడు ఆ తల్లి ఎంత తల్లడిల్లిందో! దాదాపు అయిదారు నిమిషాలు ప్రథమ చికిత్స చేశాను. అప్పుడు కళ్లు తెరిచింది. అటుగా వచ్చిన అంబులెన్స్‌ను ఆపేసి వెంటనే ఆసుపత్రికి తరలించా. కళ్లు తెరిచింది కదా.. బతుకుతుందేమో అనుకున్నా.. పాపం!

- మల్లన్న, నారాయణగూడ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని