తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
తల్లి ఒడి...పిల్లల బడి

ఇంట్లోనే పూర్వ ప్రాథమిక విద్య

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో చిన్నారులు బడి ముఖం చూడకుండానే ఒక ఏడాది గడిచిపోయింది. వచ్చే విద్యా సంవత్సరంలోనూ నర్సరీ నుంచి రెండో తరగతి వరకు చదువులు ముందుకు సాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. కరోనా మొదటి దశలోనే కొందరు తల్లులు గురువు పాత్రను కూడా సమర్థంగా పోషించారు. మూడో దశ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపథ్యంలో వారిని చదివించే గురుతర బాధ్యత తల్లులు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల్ని చదువు పట్ల ఆకర్షింపజేయడానికి పలకా బలపంతో కాకుండా ఆట పాటలతో బోధన కొనసాగించాలని బోయపాలెం డైట్‌ మనోవికాస నిపుణులు డాక్టర్‌ సుగంధరావు సూచించారు.

అక్షరాలు దిద్దించడం ఒక ఎత్తయితే వాటిని గుర్తుపట్టే సామర్థ్యం పిల్లల్లో పెంపొందించాలి. అక్షరాలు, అంకెల ఉచ్ఛా.రణ పద్ధతిగా నేర్పాలి.

మార్కెట్‌లో అక్షరాలు, అంకెలకు సంబంధించిన ఆట బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. వాటితో విద్యాబుద్ధులు నేర్పించవచ్ఛు

యూట్యూబ్‌లో అంకెలతో పాటు ఆకారాలను ఒకటో తరగతిలో పద్యాలు, ఆంగ్ల మాధ్యమంలోని రైమ్స్‌ను దగ్గరుండి చూపించాలి.

మొదట్లో మారాం..

నా పేరు కటారు నీలవేణి. మాది ముప్పాళ్ల మండలం మాదల. మా అమ్మాయి దీవెన సత్తెనపల్లిలోని కేంద్రియ విద్యాలయలో రెండో తరగతి, కుమారుడు తేజోమిఖాయేలు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గత ఏడాది ఇద్దరికీ ఆన్‌లైన్‌లో తరగతులు జరిగాయి. కరోనా మొదటి దశ కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత బడికి పంపించాలని ఉపాధ్యాయులు కోరినా సుముఖత చూపలేదు. కుమార్తెకు పూర్వ ప్రాథమిక విద్య నేర్పుతున్నా. కుమారుడి చదువుకు భర్త సహకరిస్తున్నారు. ఇద్దరినీ రోజులో రెండు నుంచి మూడు గంటలు కూర్చుబెట్టి చదివిస్తున్నా. మొదట్లో మారాం చేశారు. ఆట పాటలతో కూడిన అభ్యసన అందేలా చూస్తున్నా.

ఇంట్లోనే బడి వాతావరణం

నా పేరు షేక్‌ ఆసియా మాది సత్తెనపల్లిలోని నాగార్జునానగర్‌. బీఏ, బీఈడీ పూర్తి చేసి గృహిణిగా ఉన్నా. కరోనాకు ముందు భర్తతో కలిసి ఇంట్లోనే ట్యూషన్‌ నడిపేవాళ్లం. ఏడాదిన్నరగా ఆపేశాం. మాకు ఇద్దరు కుమార్తెలు. ఆలియా తబస్సుమ్‌ (ఒకటో తరగతి), హజరా తబస్సుమ్‌ (నాలుగో తరగతి) ప్రస్తుతం చదవాల్సి ఉంది. కొవిడ్‌తో గత ఏడాది బడికి పంపలేదు. పెద్దమ్మాయి ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంది. ఆలియాకు నేనే పాఠాలు నేర్పిస్తున్నా. ఇంట్లోనే బడి వాతావరణం ఉండేలా చూసుకున్నాం. రోజులో ఉదయం, సాయంత్రం కొంత సమయం పిల్లలకు పాఠాలు చెబుతున్నాం. పూర్వ ప్రాథమిక విద్య బోధనపై ప్రధానంగా దృష్టి సారించాం. పిల్లలు కూడా శ్రద్ధగా పాఠాలు నేర్చుకుంటున్నారు.

తొలి గురువుని..

నా పేరు సీహెచ్‌ అనురాధ. మాది సత్తెనపల్లి మండలం భట్లూరు. కుమార్తె ఇషితా ఒకటో తరగతి చదవాల్సి ఉంది. కరోనా రెండో దశకు ముందు కొన్ని రోజులు అంగన్‌వాడీ కేంద్రానికి పంపా. ప్రస్తుతం ఇంట్లోనే అక్షరాలు దిద్దిస్తున్నా. ఒకటో తరగతి చదువుకు నేనే తొలి గురువుని. ఆంగ్లం, తెలుగులో అక్షరాలు, పేర్లు, అంకెలు, రంగులు నేర్పిస్తున్నా. ఎంతో ఇష్టంగా నేర్చుకుంటోంది.

జిల్లాలో మొత్తం పాఠశాలలు : 5170

నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు సుమారు 1.20 లక్షల మంది.

ఒకటో తరగతి : 47,209 మంది

రెండో తరగతి : 77,123 మంది

2020-21 విద్యా సంవత్సరంలో పూర్వ ప్రాథమిక విద్య బోధనకు పాఠశాలలు జరిగిన రోజులు : 0

1, 2 తరగతులకు బడులు జరిగిన రోజులు 65 నుంచి 70 రోజులు

పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు బడులకు పిల్లల్ని పంపిన తల్లుల శాతం 20 నుంచి 25 శాతం

అమ్మల వద్ద పిల్లలు పాఠాలు నేర్చుకున్న రోజులు 120 నుంచి 140

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని