తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
చేయి కలిపారు.. సమస్య తీర్చారు

రైతుల ఐక్యతతో సమస్య పరిష్కారం

పొక్లెయిన్‌తో నూతన రోడ్డు నిర్మాణం

శావల్యాపురం, న్యూస్‌టుడే: ఎవరో వస్తారు..ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యను రైతులందరూ చేతులు కలిపి పరిష్కరించుకున్నారు. శావల్యాపురంలోని కొత్తలూరు మార్గంలో ఉత్తర దిక్కున పొలాలకు వెళ్లడానికి సరైన మార్గం లేదు. దీంతో రైతులు వ్యవసాయ పనులు చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు ముగింపు పలకాలని అంతా ఈ ఏడాది నిర్ణయించుకున్నారు. ఇందుకు గ్రామపెద్దలు కర్రె పెదఅంజయ్య, జవంగుల శ్రీనివాసరావు, జవంగుల బాబు, ఆరిశెట్టి ప్రసన్నాంజినేయులు, జవంగుల కోటేశ్వరరావు, జవంగుల అంజయ్య ఆధ్వర్యంలో నడుం బిగించారు.

రూ.20 లక్షలతో అప్రోచ్‌ రోడ్డు ఏర్పాటు: 68 ఎకరాలకు చెందిన రైతులు మొత్తం రూ.20 లక్షలు విరాళాల రూపంలో సేకరించి రోడ్డు పనులు చేపట్టారు. ఒక్కొక్క ఎకరాకు రూ.30 వేల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాకుండా రోడ్డు పోయడానికి ఇతర రైతుల వద్ద నుంచి 0.90 ఎకరా పొలాన్ని, సెంటు రూ.10 వేలు చొప్పున కొన్నారు. రోడ్డు పోసే సమయంలో రైతుల పొలం రోడ్డు కింద పోతే వారికి కూడా సెంటుకు రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లించనున్నారు.

తీరనున్న కష్టాలు: రోడ్డు ఏర్పాటుతో మా కష్టాలు తీరనున్నాయి. వ్యవసాయ పనుల సమయంలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఎక్కువ వ్యయం అయినా దీర్ఘకాలంగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాక పొలాలకు విలువ పెరుగుతుంది. - జవంగుల శ్రీనివాసరావు రైతు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని