తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
కేసులు తగ్గుముఖం..పడకలు ఖాళీ..!

మాచర్ల సీహెచ్‌సీ, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మెరుగైన వైద్యసేవలు

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే

మాచర్ల సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధితులు

కరోనా రెండో దశలో మాచర్లలో భారీగా కేసులు నమోదయ్యాయి... గుంటూరుకు వంద కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న మాచర్ల నుంచి బాధితులు అంత దూరం వెళ్లలేక అపసోపాలు పడ్డారు.. సీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న పడకల్లో వైద్య సేవలందించారు.. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేక ఎక్కువ మంది నరసరావుపేట, ఇతర పట్టణాలకు వెళ్లి చికిత్స పొందారు.. ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ పడకలు ఖాళీలేకపోవడం.. గుంటూరు దాకా వెళుతూ పలువురు మార్గమధ్యలో మృతిచెందిన సంఘటనలు అనేకం. ప్రభుత్వం స్పందించి కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు జగనన్న ప్రాణవాయువు బస్సు అందుబాటులోకి తేవడంతో ఎక్కువ మంది రోగులు వైద్య సేవలు పొందారు. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం మాచర్లలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయి.

గణనీయంగా తగ్గడంతో..

గతంలో ఆస్పత్రిలో పడక దొరకడమే గగనమవడంతో ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు వెచ్చించారు. పేదలు పట్టణాలకు వెళ్లలేక ఇళ్ల వద్దనే జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారి నుంచి బయట పడ్డారు. సకాలంలో వైద్యం అందక పలువురు మృతిచెందారు. దీనిపై ‘ఈనాడు’లో పలు కథనాలు రావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించారు. మాచర్ల సీహెచ్‌సీలో 15 పడకల కొవిడ్‌ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇవి చాలకపోవడంతో ఎస్టీ వసతి గృహంలో ప్రత్యేకంగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని 26పడకల(ఆక్సిజన్‌)తో ఏర్పాటు చేశారు. దీనికితోడు ప్రత్యేకంగా జగనన్న ప్రాణవాయువు బస్సును సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో బాధితులకు కొంత ఉపశమనం లభించింది. రికవరీ బాగా పెరిగింది. ఒకప్పుడు ఒకరు డిశ్ఛార్జి అయిన తరువాతే వేరొకరికి పడక ఇచ్చేవారు. ప్రస్తుతం పడకలు ఖాళీగా కనిపిస్తున్నాయి. రోజురోజుకు పడకలు ఖాళీ అవుతుండటంతోపాటు రికవరీరేటు పెరుగుతుండటంతో వైద్యాధికారులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసులు గణనీయంగా తగ్గే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో తగ్గిన రద్దీ​​​​​​​

అందరి సహకారంతోనే సాధ్యమైంది..

కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా పడకల కోసం, వైద్యసేవల విషయంలో ఎంతో ఒత్తిడి ఉండేది. ప్రజాప్రతినిధులు, అధికారులు, దాతల సహకారంతో ఇక్కడ అందిస్తున్న కొవిడ్‌ సేవలతో రికవరీ రేటు పెరిగింది. రెండు వేలమందికి ఓపీ సేవల రూపంలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందించాం. పడకలు ఏర్పాటు చేయడం ద్వారా 350 మందికి అత్యవసర వైద్యసేవలు అందించాం. ఇక్కడ ట్రూనాట్‌ పరీక్ష కేంద్రం, వైద్యులు, వైద్యసిబ్బందిని నియమించడం ద్వారా సత్ఫలితాలు పొందగలిగాం. కొన్నిరోజుల్లో కేసులు మరింత తగ్గే అవకాశముంది. - డాక్టర్‌ బీవీరంగారావు, సూపరిండెంట్‌, మాచర్ల సీహెచ్‌సీ

మాచర్లలో కొవిడ్‌ పడకల వివరాలు

సీహెచ్‌సీలో ఉన్నవి 15

కొవిడ్‌కేర్‌ కేంద్రంలో 25

ప్రాణవాయువు వాహనంలో 34

బాధితులు సంప్రదించాల్సిన నెంబర్లు

డాక్టర్‌ కేపీచారి - 90009 82582

జ్ఞానసుందరి - 81064 18720

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని