తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
కల్తీ గుట్టు కనిపెడదాం

అవగాహన పెంపుతోనే అన్ని విధాలా మేలు

న్యూస్‌టుడే, బాపట్ల

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు పరిస్థితి తయారైంది. అక్రమార్కులు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆహార పదార్థాలను సైతం కల్తీ చేస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులు, ఉప్పు, పప్పు నుంచి పంచదార, కందిపప్పు, కారంపొడి, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, చిరుధాన్యాల వరకు వేటినీ వదలడం లేదు. ఇది ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాల్లో కల్తీ ఎలా జరుగుతుంది, దానిని సామాన్యులు సైతం ఇంటి వద్దే గుర్తించే విధానాలను బాపట్లలోని డా.ఎన్టీఆర్‌ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విమలా బోరా వివరించారు. వాటి గురించి తెలుసుకుందాం..

ఐస్‌క్రీం

కల్తీ ఇలా: ఐస్‌క్రీం తెల్లగా కనపడటానికి వాషింగ్‌సోడా (సోడియం కార్బోనేట్‌)ను కలిపి కల్తీ చేస్తారు. అలాంటి వాటిని తింటే కడుపునొప్పి, కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయి.

గుర్తించే విధానం: నిమ్మరసం చుక్కలను తీసుకుని ఐస్‌క్రీంపై వేయాలి. వెంటనే బుసబుస మంటూ బుడగలు వస్తాయి. ఈ విధంగా వస్తే ఐస్‌క్రీంలో వాషింగ్‌సోడాను కలిపి కల్తీ చేసినట్లు నిర్ధారించవచ్ఛు

తేనె

కల్తీ ఇలా: తేనెలో పంచదార ద్రావణాన్ని కలిపి కల్తీ చేస్తారు. కల్తీ తేనెలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.

గుర్తించే విధానం: దూదిని తేనెలో ఉంచాలి. తర్వాత దూదికి అగ్గిపుల్లను అంటిస్తే మండుతుంది. దూది మండితే తేనె స్వచ్ఛమైనది. పంచదార ద్రావణాన్ని కలిపిన తేనెలో ముంచిన దూదికి అగ్గిపుల్ల అంటించినా నీరు ఉండటం వల్ల మండదు.

మిఠాయిలు, పసుపు, పానీయాలు

కల్తీ ఇలా: మిఠాయిలు లాంటి పదార్థాలను, పసుపు, పానీయాల్లో మెటానిల్‌ ఎల్లో(పసుపు) అనే కృత్రిమ రంగును కలిపి కల్తీ చేస్తారు. అలాంటి వాటిని తినడం వల్ల వాంతులవడం, నీరసం, చురుకుదనం లోపించడం లాంటివి దరిచేరతాయి.

గుర్తించే విధానం: మెటానిల్‌ పసుపు రంగును కలిపిన పదార్థాలకు ఆమ్లం కలిపితే గులాబీ రంగులోకి మారతాయి.

పాలు

కల్తీ ఇలా: పాలలో నీరు, పిండి, యూరియా, సబ్బులను కలిపి కల్తీ చేస్తున్నారు. కల్తీ పాలు తాగడం వల్ల అజీర్ణం, వాంతులు, మానసిక వైకల్యం వస్తాయి. పాలలో నీటిని కలిపి కల్తీ చేయడం వల్ల అతిసారం వచ్చే అవకాశం ఉంది.

గుర్తించే విధానం: నీటిని కలిపి కల్తీ చేసిన పాల చుక్కలను ఏటవాలుగా ఉన్న ప్రాంతంపై పోస్తే నీటిని వదిలి పాలు ముందు కిందకు ప్రవహిస్తాయి. ఇలా పాలలో నీటిని కలిపి చేసే కల్తీని గుర్తించవచ్ఛు

యూరియా కలిపి కల్తీ చేసిన పాలను ఓ స్పూన్‌లో తీసుకుని పరీక్ష నాళికలో పోయాలి. దానికి అర స్పూన్‌ సోయాబీన్‌ పొడి కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిసేటట్లు చేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఎర్ర లిట్మస్‌ కాగితాన్ని మిశ్రమంలో ఉంచాలి. అనంతరం దాన్ని బయటకు తీసిన నిమిషం తర్వాత లిట్మస్‌ కాగితం నీలం(బ్లూ) రంగులోకి మారితే పాలలో యూరియా ఉన్నట్లు గుర్తించాలి.

పిండిని కలిపిన ఓ స్పూన్‌ పాలను పరీక్ష నాళికలో పోయాలి. తర్వాత కొన్ని అయోడిన్‌ చుక్కలను పరీక్ష నాళికలో వేస్తే పాలు నీలం(బ్లూ) లేదా నల్ల రంగులోకి మారతాయి. ఈ విధంగా పాలలో పిండిని కలిపినట్లు గుర్తించవచ్ఛు

మిరియాలు

కల్తీ ఇలా: ఎండబెట్టిన, రంగు వేసిన బొప్పాయి గింజలను కలిపి మిరియాలు కల్తీ చేస్తారు. అలాంటివి తినడం వల్ల కడుపు నొప్పి, కాలేయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గుర్తించే విధానం: గ్లాసులో నీటిని పోసి కల్తీ చేసిన మిరియాలు వేయాలి. అందులో బొప్పాయి గింజలు నీటిపైన తేలియాడతాయి. మిరియాల గింజలు గ్లాసు అడుగుకు చేరతాయి.

గోధుమ పిండి

కల్తీ ఇలా: గోధుమ పిండిలో చాక్‌పీస్‌ పౌడర్‌ను కలిపి కల్తీ చేస్తారు. కల్తీ గోధుమ పిండితో చేసిన పదార్థాలను తినడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

గుర్తించే విధానం: పరీక్ష నాళికను తీసుకుని గోధుమ పిండి వేసి అందులో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం కలపాలి. పైన తెల్లటి నురగ వస్తే చాక్‌పీస్‌ పొడిని కలిపినట్లుగా గుర్తించాలి.

కారం పొడి

కల్తీ ఇలా: కారం పొడిని ఇటుక పొడి, కృత్రిమ రంగులు, రంగు చెక్క పొడి, పొట్టును కలిపి కల్తీ చేస్తారు. అలా చేసిన కారం పొడిని తింటే కాలేయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కడుపు నొప్పి వస్తుంది.

గుర్తించే విధానం: కారం పొడిని తెల్ల కాగితంపై తీసుకుని ఇథైల్‌ ఆల్కాహాల్‌ చుక్కలను వేయాలి. అవి వేసిన ప్రాంతంలో కాగితంపై ఎర్రటి మరక ఏర్పడుతుంది. బీకరులో నీటిని తీసుకుని దానిలో కారం పొడిని కలపాలి. కొద్ది నిమిషాలకు బీకరు లోపల నీటిపై ఎర్రటి రంగు చెక్కపొడి తేలుతుంది. బీకరు అడుగున ఇటుకరాయి పొడి చేరుతుంది.

వంట నూనె

కల్తీ ఇలా: వంట నూనెలో నిషేధించిన రంగులను కలుపుతుంటారు. వీటితో చేసిన వంటకాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. జీర్ణకోశ వ్యాధులు వస్తాయి.

గుర్తించే విధానం: పరీక్ష నాళికను తీసుకుని 5మి.లీ. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని పోయాలి. దానిలో 5మి.లీ. నూనెను పోసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత నూనెలో కలిపిన రంగు పరీక్ష నాళికలో ద్రావణం పైభాగంలో కనపడుతుంది.

కొబ్బరినూనె

కల్తీ ఇలా: కొబ్బరినూనెలో ఇతర నూనెలు కలిపి కల్తీ చేస్తారు.

గుర్తించే విధానం: గాజు సీసాలో కల్తీ చేసిన కొబ్బరినూనెను పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. కల్తీ నూనెల నుంచి విడిగా కొబ్బరి నూనె గడ్డకడుతుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని