తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
నేటి నుంచి మిర్చియార్డులో క్రయవిక్రయాలు

యార్డులో పేరుకున్న వ్యర్థాలు తొలగిస్తున్న సిబ్బంది

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులో 40 రోజుల తర్వాత క్రయవిక్రయాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గత నెల మొదటి వారంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం, ఎండలు కూడా అధికంగా ఉన్నందున పది రోజులు ముందుగానే మిర్చియార్డుకు సెలవులు ప్రకటించారు. మే 3వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు యార్డులో లావాదేవీలు నిలిపివేశారు. కర్ఫ్యూ నిబంధనలతో పాటు ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఎగుమతి, దిగుమతి, హమాలీ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు మరో వారం రోజులు పాటు సెలవులు ఈనెల 13 వరకు పొడిగించారు. యార్డుకు సెలవులు ఇచ్చినప్పటికీ రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా శీతలగిడ్డంగులు, గోదాముల్లో క్రయవిక్రయాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు, వడగాడ్పుల తీవ్రత తగ్గడం, కరోనా కేసులు నెమ్మదించడంతో యార్డులో అమ్మకాలు, కొనుగోళ్లు ఈనెల 14వ తేదీ నుంచి పునఃప్రారభించాలని పాలకవర్గం, అధికారులు నిర్ణయించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. యార్డులో చెత్త, చెదారాలు, వ్యర్థాలను తొలగించి సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో రోడ్లను, కమీషన్ల ఏజెంట్ల దుకాణాలను, కార్యాలయంతో పాటు పరిసరాలన్నింటినీ శానిటైజ్‌ చేయించారు. రైతులు శీతలగిడ్డంగుల నుంచి కూడా సరకు తరలించే అవకాశం ఉన్నందున చిలకలూరిపేట రహదారి, నరసరావుపేట రోడ్డు రెండు వైపులా గేట్లను తెరచి మిర్చి బస్తాలను లోపలకు అనుమతించనున్నారు. రెండు, ఏడు గేట్ల వద్ద థర్మల్‌ స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం రైతులు, వ్యాపారులు హమాలీలను మిర్చియార్డులోకి ప్రవేశం కల్పించనున్నారు. పతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధ్రరించాల్సిందేనని యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ-నామ్‌ ద్వారా క్రయవిక్రయాలు నిర్వహించనున్నామని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎగుమతి వ్యాపారులు యార్డుకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని