తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
ప్రసవ వేదన

పీహెచ్‌సీల్లో అందని సేవలు

 అందుబాటులో ఉండని వైద్యులు 

బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం పీహెచ్‌సీకి ఈ మధ్య గర్భిణి ఒకరు పురిటినొప్పులతో బాధపడుతూ అర్ధరాత్రి వెళ్లగా ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్‌ అందుబాటులో లేరు. ఆమెకు ఉమ్మనీరు సమస్య తలెత్తి ఇబ్బంది పడుతోంది. నర్సు ఆమెను కాన్పుల గదిలోకి తీసుకెళ్లి సపర్యలు చేసి అత్యవసర కేసు వచ్చిందని వైద్యుడికి ఫోన్‌ చేశారు. గుంటూరులో నివాసం ఉండే ఆయన ప్రాథమిక వైద్యం అనంతరం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి పంపాలని నర్సుకు సూచించగా 108 వాహనం రప్పించి అక్కడకు తీసుకెళ్లారు.

గుంటూరు రూరల్‌ మండలానికి చెందిన మరో మహిళ రెండు మాసాల కిందట పెదపలకలూరు పీహెచ్‌సీకి పురిటి నొప్పులతో వచ్చారు. ఆమె కవలలకు జన్మనిచ్చారు. ప్రసవ అనంతరం బాలింత తీవ్ర అనారోగ్యం పాలు కావటంతో ఆమెకు వైద్యసేవలు అవసరం కాగా వైద్యుడు అందుబాటులో లేరు. పేషెంటు కుటుంబీకులు వాహనం సమకూర్చుకుని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే తల్లి, కవలలు చనిపోయారు.

పిడుగురాళ్లకు చెందిన ఒక మహిళ మే మొదటి వారంలో గుంటూరు జీజీహెచ్‌కు కాన్పు కోసం వచ్చి ఓపీ బ్లాక్‌ వద్ద ఆరుబయటే ప్రసవించింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పిడుగురాళ్ల నుంచి ఆ మహిళ పురిటినొప్పులతో జీజీహెచ్‌ వరకు ఎందుకొచ్చిందని ఆరా తీస్తే కొవిడ్‌ దృష్ట్యా పీహెచ్‌సీల్లో చేర్చుకోవటం లేదని గుంటూరు వెళ్లాలని సూచించటంతో, ఇక్కడకు వచ్చినట్లు ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

ఈనాడు, అమరావతి

జిల్లాలోని పీహెచ్‌సీల్లో రోగులకు అత్యవసర వైద్యసేవలు అందని ద్రాక్షే అవుతున్నాయి. ఒక్కో ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రానికి ఇద్దరేసి వైద్యులు, ముగ్గురు నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో 88 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఆసుపత్రికి సమీపంగా ఏ క్షణాన పిలిచినా వచ్చేలా అందుబాటులో నివాసం ఉండాల్సిన వైద్యులు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి వంటి పట్టణాల్లో ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు మరింత బలోపేతమైతేనే మాతృ-శిశు మరణాలకు అడ్డుకట్టపడుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతి పీహెచ్‌సీకి అదనంగా ఒక డాక్టర్‌, మరో ఇద్దరు నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్యానికి అతీగతి లేకుండా ఉందనటానికి పైన పేర్కొన్న ఉదంతాలే నిదర్శనం. చాలాచోట్ల ఇద్దరు వైద్యుల్లో ఎవరో ఒక్కరే విధుల్లో ఉంటున్నారు. 15 రోజులకు ఒకరి చొప్పున డ్యూటీలు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కరోనాను సాకుగా చూపి చాలామంది వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పీహెచ్‌సీల గుమ్మం తొక్కటం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, టీకా వేసే పనుల్లో ఉన్నామని తప్పించుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా ప్రసవకేసులు చూడటం లేదని కొందరు సిబ్బంది ముందుగానే గర్భిణులకు సూచించి వారిని గుంటూరు జీజీహెచ్‌ లేదా సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు.

పరిస్థితి మరీ దారుణం

జిల్లాలో 24 గంటలు నడిచే పీహెచ్‌సీలతో పాటు ఇతర ఆస్పత్రుల్లో ఏప్రిల్‌, మే మాసాల్లో నిర్వహించిన కాన్పులు, ఓపీ సేవలు, ఇతర ల్యాబ్‌ పరీక్షల వివరాలను పరిశీలిస్తే పీహెచ్‌సీల్లో వైద్యసేవలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. 24 గంటల ఆసుపత్రులకు నెలకు 10 చొప్పున రెండు మాసాలకు 20 ప్రసవాల లక్ష్యాన్ని విధించారు. రాజుపాలెం, బొల్లాపల్లి, కారంపూడి, చందోలు పీహెచ్‌సీల్లో ఒక్కటంటే ఒక్క కాన్పు చేయలేదు. తుళ్లూరు, ముప్పాళ్ల, క్రోసూరు, నూజండ్లలో ఒక్కో ప్రసవం మాత్రమే చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా మాచవరంలో 16, దుర్గిలో 14 ప్రసవాలు జరిగాయి. ఇప్పటికైనా జిల్లా పాలనాధికారి, ఇతర వైద్య ఉన్నతాధికారులు పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని