తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
కరోనా మరణమృదంగమే

పట్టణాల్లో రెండు నెలల్లో పెరిగిన ధ్రువపత్రాల జారీ

న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం

కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతంగా ఉన్న ఏప్రిల్‌, మే నెలల్లో జిల్లాలోని పలు పట్టణాల్లో మరణాలు అధికంగా సంభవించాయి. ఈ విషయాన్ని జారీ అయిన మరణ ధ్రువపత్రాలే తెలియజేస్తున్నాయి. మృతులకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవడంలో కుటుంబ సభ్యులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చాలామంది ప్రయివేటు, ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతమంది పరిస్థితి విషమంగా మారిన సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించేలోపే చనిపోయారు. కొంతమంది కొవిడ్‌కు ఇంటి వద్ద చికిత్స పొందుతూనే మృత్యువాత పడ్డారు. మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రులు, పంచాయతీ కార్యాలయాలు, నగరపాలక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. చాలామందికి ఈ పత్రం ఎక్కడ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

జిల్లాలోని పలు పురపాలక సంఘాలలో గతేడాది ఏప్రిల్‌, మే నెలలతో పొలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ మే నెలలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. రెండోదశలో ఆక్సిజన్‌, పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు అందక అధిక సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

పత్రాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఇలా..: ● పంచాయతీ, పురపాలక, నగరపాలక ప్రభుత్వాసుపత్రులలో అందజేస్తున్న మరణ ధ్రువీకరణ పత్రాలలో మృతుని పేరు, తండ్రి పేరు, వయస్సు, ఊరిపేరు ఒక్కొక్కసారి తప్పుగా నమోదు చేస్తున్నారు. దీంతో జీవితబీమా కోసం క్లైమ్‌ చేయడం కుదరదని సంబంధిత అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందేలోపు మృతిచెందిన వారికి మరణ ధ్రువీకరణ ఇచ్చే అంశాలపై అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు.

సర్వజనాసుపత్రికి వెళ్లి అడిగితే పంచాయతీలో తీసుకోవాలంటున్నారు. పంచాయతీ అధికారులను ఆశ్రయిస్తే ఆసుపత్రిలోనే ఇస్తారని చెబుతున్నారు.

ఎవరు ఎక్కడ తీసుకోవాలి?

ప్రభుత్వాసుపత్రులలో మృతి చెందితే ప్రస్తుతం అక్కడే మరణ ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు.

గుంటూరు సర్వజనాసుపత్రితో పాటు అన్ని పట్టణాల్లో ఉన్న ప్రధాన ఆసుపత్రులలో అక్కడే ఇస్తున్నారు. ● ప్రయివేటు ఆసుపత్రిలో మృతిచెందితే ఆసుపత్రి వారే ఆన్‌లైన్‌లో నమోదు చేసి మృతుల బంధువులకు రశీదు ఇస్తారు. దానిని తీసుకెళ్లి నగరపాలక, పురపాలక సంఘాల్లో అందజేస్తే అక్కడ మరణ ధ్రువీకరణపత్రం ఇస్తారు.

గ్రామాల్లో కొవిడ్‌తో మృతి చెందితే పంచాయతీ కార్యాలయాలలో వివరాలు నమోదు చేసుకుంటే ధ్రువపత్రం అందజేస్తారు.

బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలి

కరోనాతో మృతిచెందిన బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలి. అలాంటి వారిని ఆసుపత్రి, నగరపాలక, పురపాలక, పంచాయతీలలో మరణధ్రువీకరణ పత్రాల కోసం ప్రతిసారి తిప్పి పంపించకుండా అన్ని వివరాలు నమోదు చేసుకుని పత్రాలు అందజేస్తే వారికి ఎంతో మేలు.

కొవిడ్‌ మృతులని నిర్ధారణ కావాలంటే..

ప్రస్తుతం కొవిడ్‌తో మృతిచెందిన వారికి సంబంధించి బీమా పొందాలన్నా ప్రభుత్వాలు అందించే సాయం అందాలన్నా మరణధ్రువీకరణ పత్రం అవసరం. ఈ పత్రంతోపాటు ఆసుపత్రి నుంచి కొవిడ్‌ నిర్ధరణ చేసిన అన్ని పత్రాలను తీసుకోవాలి. ఆర్టీపీసీఆర్‌ ద్వారా ప్రభుత్వం ఇచ్చే రిపోర్టు, ప్రభుత్వ సూచించిన నిబంధనల ప్రకారం సిటీస్కాన్‌ ద్వారా కొవిడ్‌ నిర్ధరణ అయితే దానికి సంబంధించిన పత్రాలు, చికిత్సపొందిన ఆసుపత్రిలో మరణాంతర పత్రాలు ఇలా అన్ని పొందాలి. అప్పుడే కరోనా మృతికింద నమోదు అవుతోంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని