తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
సాగర్‌కు కృష్ణమ్మ ప్రవాహం

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు నీరు

న్యూస్‌టుడే, మాచర్ల

నాగార్జునసాగర్‌లో నీరు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరదనీటి రాక ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ ప్రవాహం చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ఆశాజనకంగా పడిన నేపథ్యంలో ఏపీలోని ప్రాజెక్టులకు నీరు వస్తోంది. 2019, 2020 సంవత్సరాలలో ఏపీలో ఆశించిన విధంగా వర్షాలు లేకపోయినా, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ గేట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 533.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 312 టీఎంసీలకు సమానం.

గత రెండేళ్లు వరుసగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల చేరువకు చేరింది. నిరుడు అయితే 50 రోజులకు పైగా సాగర్‌ పూర్తిస్థాయి గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తొమ్మిది లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు గేట్ల నుంచి కిందకు పరుగులు తీసింది. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. అక్కడ నుంచి కర్ణాటకలోని ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రాజెక్టులకు త్వరలోనే భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉంది. సాగర్‌ నీటిమట్టం 540 అడుగులు దాటితే జలాలు గేట్లను తాకుతాయి. మరో 50 అడుగుల నీటి చేరికకు అవకాశాలు ఉంటాయి.

ఖరీఫ్‌కు చిగురిస్తున్న ఆశలు : సాగర్‌ కుడికాలువ ఆయకట్టు 11లక్షల ఎకరాల పరిధిలోని అన్నదాతలకు ఖరీఫ్‌ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం సీజన్‌ ప్రారంభమైనా కాలువ కింద వ్యవసాయ పనులు తక్కువగానే మొదలయ్యాయి. ఆయకట్టులో వ్యవసాయబోర్లు ఉన్న రైతులు మాత్రం ఆరుతడి పంటల వైపు అడుగులు వేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రైతులు సాగర్‌కు నీటి చేరికపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా మారాయి. మరోవైపు సాగర్‌లో నీటిచేరిక నేపథ్యంలో క్రస్ట్‌గేట్ల పనితీరును అధికారులు పరీక్షిస్తున్నారు. ఇప్పటికే కుడికాలువలో మరమ్మతులకు గురైన 9వ గేటు స్థానంలో కొత్తది అమర్చిన విషయం తెలిసిందే.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని