తాజా వార్తలు

Published : 22/07/2021 05:00 IST
మోసం గురూ..

మార్కెటింగ్‌తో బురిడీ

భారీగా నష్టపోతున్న బాధితులు

ఈనాడు, అమరావతి

తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం.. కొత్తగా సభ్యులను చేర్పిస్తే అదనంగా బోనస్‌.. ఇంకేముంది.. నిరుపేద, మధ్య తరగతి వారు అధికంగా డబ్బు చెల్లిస్తారు.. హఠాత్తుగా బిచాణా ఎత్తేస్తారు. ఇవీ గత కొంత కాలంగా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలు చేసే మోసాలు. ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. సంస్థ పుట్టుకొచ్చిన వెంటనే ఆలోచించకుండానే పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు. విజయవాడలో పలు కేసులు నమోదు అవుతున్నాయి.

తిమ్మిని బమ్మిని చేసి..

విజయవాడకు చెందిన ఇద్దరు ‘గో రైడ్‌ ఎన్‌ ఫన్‌’ పేరుతో సంస్థను ప్రారంభించారు. నగరంలోని మొగల్రాజపురంలోని రెవెన్యూ కాలనీలో దీనిని ఏర్పాటు చేశారు. ఇది మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ. అంతర్జాలం, యూ ట్యూబ్‌ ద్వారా తమ సంస్థకు చెందిన పలు పథకాలను ప్రచారం చేశారు. సభ్యుడిగా చేరే వ్యక్తి రూ.10వేలు చెల్లిస్తే.. వారానికి రూ.500 చొప్పున కంపెనీ ఇస్తుంది. 52 వారాల తర్వాత రూ.10వేలు వెనక్కి ఇస్తుందని, వారానికి 5 శాతం లాభం వస్తుందని నమ్మబలికారు. కొత్త వారిని సభ్యులుగా చేర్పిస్తే కొంత మొత్తం పారితోషికంగా ఇస్తామన్నారు. దీంతో చాలా మంది కట్టిన తర్వాత.. డబ్బులు చెల్లించకుండా పత్తాలేకుండా పోయారు. వీరి మాటలు నమ్మి పలువురు తమ డబ్బులు పోగొట్టుకున్నారు.

మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో డబ్బులు వసూలు చేసే కంపెనీలు నమోదు చేయకుండానే నడుపుతున్నారు. వీటి గురించి ఆరా తీయకుండానే ప్రజలు డిపాజిట్‌ చేస్తున్నారు. బోగస్‌ సంస్థలను ముందుగానే గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో వారు బోర్డు తిప్పే వరకు బయటకు సమాచారం పొక్కడం లేదు. ఆకర్షణీయమైన వడ్డీ పేరుతో వల వేస్తున్నారు. దీనికి అదనంగా కొత్తగా సభ్యులను పరిచయం చేస్తే బోనస్‌ ఇస్తామని ఎర వేస్తున్నారు. విజయవాడలో ఇటీవల వెలుగుచూసిన మోసాలు ఎక్కువగా ఇలాగే బురిడీ కొట్టించారు. పెట్టుబడులను షేర్‌ మార్కెట్లు, ఫారెక్స్‌ ట్రేడింగ్‌, తదితర మార్గాలలో పెట్టనున్నట్లు నమ్మిస్తున్నారు. వచ్చిన లాభాలతో అందరికీ పంచుతామంటున్నారు. ‘మనీ మేక్స్‌ మనీ’ పేరుతో మోసం చేసిన వ్యక్తి అయితే ఖాతాదారులకు వివిధ రకాలుగా భ్రమలు కల్పించాడు. తనకు అమెరికాకు చెందిన ఓ ఆర్థికవేత్త సలహాలు ఇస్తుంటాడని నమ్మబలికాడు. దీంతో అందరూ గుడ్డిగా నమ్మారు. దీంతో పలువురు తమ వద్దనున్న నగదుకు తోడు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఎక్కువ మందిని ఆకట్టుకోవడానికి మంచి స్కీమ్‌లు ప్రకటిస్తారు. వీటి ఆధారంగా పేద, మధ్య తరగతి ప్రజలను వల వేసి తమ ఉచ్చులో పడేలా చేస్తున్నారు. కొన్నాళ్లు నమ్మకంగా ఇస్తారు, ఠంఛనుగా డబ్బు వస్తోంది కదా అని అందినకాడికి అప్పు చేసి పెడుతున్నారు.అంతా అయిపోయిన తర్వాత కానీ విషయం బోధపడడం లేదు.

● కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వంశీకృష్ణ ‘మనీ మేక్స్‌ మనీ’ పేరుతో బ్లాగ్‌, తర్వాత యూ ట్యూబ్‌లో ఛానల్‌ ప్రారంభించాడు. తన వద్ద డబ్బు పెట్టుబడి పెడితే దానిని రెట్టింపు చేసి ఇస్తానని ఛానల్‌ ద్వారా ప్రచారం చేశాడు. ఇందులో 90 రోజుల పథకం ఒకటి. రూ.5వేలు నుంచి రూ.3లక్షల వరకు పెట్టుబడి పెడితే 90 రోజులలో రెట్టింపు ఇస్తానని నమ్మబలికాడు. రూ.5వేలు డిపాజిట్‌ చేస్తే, రోజుకు రూ.100 చొప్పున 90 రోజుల్లో రూ.9వేలు ఇచ్చాడు. చెల్లింపుల కోసం బ్యాంకు ఖాతాలు, ఫోన్‌పే, పేటీఎంలో ఖాతాలు తెరిచి వాటిల్లో డబ్బు వేయమనేవాడు. ఎక్కువ మందిని చేర్చుకునేందుకు బోనస్‌ కూడా ప్రకటించాడు. అప్పటికే చేరిన వ్యక్తి మరొకరిని పరిచయం చేస్తే రూ.500 చెల్లించాడు. దీంతో అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో చాలా మంది ఎక్కువ మొత్తంలో డబ్బును అతడి ఖాతాల్లో వేశారు. అపరిమితంగా డబ్బు రావడంతో చాప చుట్టేశాడు. రూ.13 కోట్ల వరకు 2వేల మందిని మోసం చేశాడు.

● తాజాగా విజయవాడకు చెందిన పలువురు రెండు వెబ్‌సైట్లలో ప్రకటనలు చూసి పెట్టుబడులు పెట్టారు. తమ సైట్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని నమ్మి భారీగా చేతులు కాల్చుకున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడంతో, నిర్వాహకులు ఆ సైట్‌ను మూసివేశారు. సరైన సమాచారం చెప్పే వారు లేకపోవడంతో మూడు రోజుల క్రితం సైబర్‌ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు.


ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి..

- సాయి సతీష్‌, సైబర్‌ రక్షణ నిపుణుడు, విజయవాడ

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌, ట్రేడింగ్‌ పేరుతో అనేక సైట్లు, అప్లికేషన్లు ఇటీవల కాలంలో వచ్చాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్నంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చాలా వరకు మోసపూరితమైనవే ఉంటాయి. స్టాక్స్‌లో ట్రేడింగ్‌ చేయదలచుకుంటే.. సెబీ అధీకృత అప్లికేషన్లలోనే పెట్టుబడి పెట్టాలి. మిగిలిన వాటిని నమ్మి మోసపోవద్ధు చైనా దేశానికి గేమ్స్‌ ఆడే సమయంలో కొన్ని బోగస్‌ ప్రకటనలు వస్తుంటాయి. మీ పెట్టుబడికి అనేక రెట్లు ఎక్కువ సొమ్ము వస్తుందని ఊరిస్తారు. వీటి వలలో చిక్కుకోవద్ధు క్రిప్టో కరెన్సీ పేరుతోనూ నకిలీ అప్లికేషన్లు చలామణిలో ఉన్నాయి. ఇటువంటి వాటిని నమ్మొద్ధు మీ డబ్బును రెట్టింపు చేస్తామని, పలువురిని చేర్పిస్తే అదనంగా బోనస్‌ ఇస్తామని చెప్పే సంస్థల గురించి అన్ని రకాలుగా ఆరా తీసిన తర్వాతే ముందడుగు వేయాలి.


 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని