తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

గురువారం బాబు జన్మదిన వేడుకలో వెంకటేశ్వర్‌రావుకు కేకు తినిపిస్తున్న భార్య

జడ్చర్లగ్రామీణం, జడ్చర్ల అర్బన్‌, న్యూస్‌టుడే : ఓ కాంక్రీట్‌ మిక్చర్‌ వాహనం ట్రాక్టర్‌ ట్రాలీని తాకి, ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల-కోదాడ 167వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చోటుచేసుకొంది. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు జడ్చర్లలోని మార్కెట్‌ యార్డుకు ధాన్యం తెచ్ఛి. కొనుగోలు చేయకపోవడంతో ట్రాక్టర్‌లో తిరిగి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల వైపు నుంచి కంకర, సిమెంటు మిక్చర్‌ వాహనం వెళ్తూ.. గంగాపూర్‌ సమీపంలో ట్రాక్టర్‌ను దాటేసేక్రమంలో ట్రాలీని తగిలి, అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని రోడ్డుపక్కన బోల్తాపడింది. ధాన్యంలోడుతో వెళ్తున్న ట్రాలీ బోల్తాపడటంతో దానిపై ఉన్న వెంకటాపురం గ్రామానికి చెందిన సురేశ్‌ (19), ద్విచక్ర వాహనంపై వస్తున్న గంగాపూర్‌ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి రవి (21), పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్న కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన బి.వెంకటేశ్వర్‌రావు (30), అతని తండ్రి శ్రీనవాసరావు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్‌, జడ్చర్ల సీఐ వీరస్వామి, ఎస్‌ఐ శంషుద్దీన్‌ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

మనవరాలి పుట్టిన రోజు వేడుకకు వచ్ఛి.: కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వెంకటేశ్వర్‌రావు జడ్చర్లలోని పద్మావతి కాలనీలో ఉంటూ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతడి కుమార్తె పుట్టిన రోజు వేడుక గురువారం ఉండటంతో తల్లిదండ్రులు ఇటీవలే జడ్చర్లకు వచ్చారు. వెంకటేశ్వర్‌రావు ఇటీవల గంగాపూర్‌ సమీపంలోని ఓ పౌల్ట్రీని లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తన తండ్రి శ్రీనివాసరావుని తీసుకొని వెళ్లి పౌల్ట్రీని చూపించుకొని రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని