తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల మద్యం పట్టివేత

నిజాంపేట, న్యూస్‌టుడే: డీసీఎం వాహనం ద్వారా ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను బాచుపల్లి పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి నుంచి మద్యం రవాణా జరుగుతున్నట్లు మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై శివప్రసాద్‌ ఆధ్వర్యంలోని బృందం తనిఖీల్లో భాగంగా డీసీఎం వ్యాను (ఏపీ39 వై 6858)ను సోదా చేశారు. అందులో వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలు భారీగా లభించాయి. వాటి విలువ రూ. 4 లక్షల దాకా ఉంటుందని గుర్తించారు. అనంతరం వాహన డ్రైవర్‌ నాగరాజుతో పాటు అతడి సోదరుడైన జానయ్యను అదుపులోకి తీసుకున్నారు. జానయ్య గతంలో ఓ మీడియా సంస్థ ప్రతినిధిగా పనిచేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓ వ్యాపారి ద్వారా మద్యం సీసాల్ని కొనుగోలు చేసి.. ఆపై ఏపీలోని విజయవాడకు అక్రమంగా తరలించి అక్కడ రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన సదరు వాహనం ఓ ఫార్మా కంపెనీకి ముడి సరుకును తీసుకొచ్చిందని, తిరిగి వెళ్తున్న క్రమంలో అందులోనే మద్యం సీసాలను తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

రెడ్డిగూడెం: తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 581 మద్యం సీసాలతో పాటు ట్రక్కు ఆటోను రెడ్డిగూడెం పోలీసులు మిట్టగూడెం కూడలిలో శుక్రవారం స్వాధీనం చేసుకొన్నట్లు నూజివీడు డీఎస్‌పీ బి.శ్రీనివాసులు తెలిపారు. రెడ్డిగూడెం మండలం మిట్టగూడెం కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన గుంటు ప్రకాష్‌ ట్రక్కు ఆటోలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని వైన్‌ షాపులో కొనుగోలు చేసిన రూ.89,390 విలువైన మద్యం సీసాలను విజయవాడ తరలిస్తుండగా పట్టుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. మద్యం పట్టుకొన్న రెడ్డిగూడెం ఎస్‌ఐ డి.ఆనంద్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ హనుమంతరావు, హరీష్‌లకు నగదు రివార్డు అందజేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని