తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
పొలం సరిహద్దు వివాదంలో వ్యక్తి హత్య

చిలకలపూడిలో పంది వీర ప్రసాద్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాసు, ఎస్సై లక్ష్మీనరసింహ మూర్తి

ఘంటసాల, న్యూస్‌టుడే : పొలం సరిహద్దు వివాదంలో ఒకరు హత్యకు గురైన సంఘటన మండలంలోని చిలకలపూడిలో శుక్రవారం జరిగింది. ఎస్సై లక్ష్మీనరసింహమూర్తి వివరాల ప్రకారం.. చిలకలపూడికి చెందిన పంది వీరప్రసాద్‌ అలియాస్‌ ప్రభాకర్‌ (60) అదే గ్రామానికి చెందిన కె.రామయ్యకు కొంత కాలంగా పొలం సరిహద్దు వివాదాలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం మరోమారు వివాదం ఏర్పడింది. దీంతో వీరప్రసాద్‌పై రామయ్య, అతని కుటుంబ సభ్యులు ఆయుధాలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. రాత్రి అయినా ఇంటికి రాలేదని వీరప్రసాద్‌ కుటుంబ సభ్యులు పొలం వెళ్లగా నిర్జీవంగా పడిఉన్నాడు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసు, ఎస్సై పరిశీలించారు. మృతుని కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఏటూరులో మహిళ..

చందర్లపాడు, న్యూస్‌టుడే: కాపురానికి వెళ్లడం లేదనే ఆగ్రహంతో కుటుంబ సభ్యులు గంధం రత్నకుమారి(35)ని గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రత్నకుమారికి మొదటి భర్త చనిపోవడంతో ఏడాదిన్నర కిందట గుంటూరు జిల్లా తాడికొండ మండలం యండ్రాయి గ్రామానికి చెందిన కాంసూన్‌తో వివాహం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటోంది. కాపురానికి పంపించడానికి తల్లి సమాధానం, సోదరి కనకమ్మ, అక్క కుమారుడు మణికంఠ పలుమార్లు ప్రయత్నించారు. ఇదే విషయమై రత్నకుమారికి, కుటుంబ సభ్యులకు తరచూ వాగ్వాదం జరుగుతూ ఉండేది. గురువారం రాత్రి మరోసారి వివాదం నెలకొంది. దాంతో ఆమె గొంతునులిమి కుటుంబ సభ్యులు చంపేశారు. శుక్రవారం ఉదయం రత్నకుమారి శవమై వాకిట్లో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి, సోదరి, అక్క కుమారుడు ఇంట్లో నుంచి పరారయ్యారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ నాగేంద్రబాబు, ఎస్సై వి.ఏసోబు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని