తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
విషాదమే

నగరపాలికలో 3 వేలకు పైగా మరణాల నమోదు

ఈనాడు - అమరావతి

విజయవాడ పాతబస్తీలోని ఇస్లాంపేటకు చెందిన తన్వీర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గత నెలలో ఆయన మేనమామ కరోనాతో అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చారు. అదే కుటుంబంలో ఆయన తల్లి, బాబాయికి కరోనా వచ్చింది. దగ్గరుండి వారి బాగోగులు చూడడంతో తన్వీర్‌కు కూడా కొవిడ్‌ సోకింది. ఇతనొక్కడే కరోనాను జయించగలిగారు. మిగిలిన ముగ్గురిని మహమ్మారి బలి తీసుకుంది.

..ఇది ఒక్క తన్వీర్‌ కుటుంబంలోనే కాదు.. నగరంలోని చాలా ఇళ్లల్లో అందర్నీ మహమ్మారి చుట్టేసింది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా మరణించిన ఘటనలు మే నెలలో సంభవించాయి. దీని వల్ల పలు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి.

గత నెలలో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. జిల్లాలో 26,474 మంది మహమ్మారి బారిన పడ్డారు. గరిష్ఠంగా రోజుకు 1,400 కేసులు వచ్చాయి. వీటిలో అత్యధికం విజయవాడ నగరంలోనివే. వీఎంసీలోని జనన, మరణాల నమోదు విభాగంలో నమోదైన సంఖ్య క్రితం నెలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. సాధారణంగా నెలలో 650 వరకు నగర పరిధిలో మరణాలు రికార్డు అవుతాయి. వేసవిలో అయితే వడదెబ్బకు అదనంగా మరో 200 మంది వరకు ఉంటాయి. ఈ ఏడాది మాత్రం మరణాల సంఖ్య అనూహ్యంగా ఎగబాకింది. ఏప్రిల్‌లో కొవిడ్‌ ఉద్ధృతి పెరిగింది. ఇదే నెలలో 900 మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మే నెలకు వచ్చే సరికి 3,525 నమోదయ్యాయి. ఇదే నెలలో విజయవాడలో కొవిడ్‌ మరణాలు 54గా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన సంఖ్య గురించి నిర్ధారణ కాలేదు. దీనిపై ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఇప్పటికీ నమోదు

మే నెలలోని మరణాలకు సంబంధించి వీఎంసీలో ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. చనిపోయిన వారు ఏ ప్రాంతం వారైనా కార్పొరేషన్‌లోనే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే 2,500 ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిందని అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల నాలుగైదు జిల్లాలకు విజయవాడ ప్రధాన కూడలి కావడంతో ఇక్కడి ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం ఎక్కువ మంది వస్తుంటారు. సహజ మరణం, వివిధ అనారోగ్య సమస్యలతో చనిపోయారని అనుకున్నా ఇంత భారీగా ఎలా నమోదయ్యారో అధికారులు చెప్పలేకపోతున్నారు. ఆస్పత్రుల నుంచి మరణాలకు సంబంధించిన సమాచారం నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు వీఎంసీకి అందుతుంది. ఇళ్లల్లో మరణించిన వారికి సంబంధించి నమోదు నగరంలోని డివిజనల్‌ కార్యాలయాల్లో జరుగుతోంది. 21 రోజులు దాటితే మాత్రం నోటరీ చేయించి నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే చేస్తున్నారు.

జూన్‌లో కాస్త తగ్గుముఖం!

ప్రస్తుతం జూన్‌ నెలలో మరణాల సంఖ్య బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. 15వ తేదీ వరకు దాదాపు 800 వరకు వచ్చాయి. నెల పూర్తయ్యేసరికి సంఖ్య 1,600 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు రికార్డు కాలేదని నగరపాలక అధికారులు చెబుతున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని