తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
ముగిసిన ఎమ్మెల్సీల పదవీకాలం

జిల్లాలో తగ్గిన తెదేపా ప్రజాప్రతినిధులు

ఈనాడు, అమరావతి

జిల్లా నుంచి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీల పదవీకాలం శుక్రవారం నాటితో పూర్తయింది. జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు తెదేపాకు దక్కిన విషయం తెలిసిందే. ఒక స్థానం నుంచి బుద్ధా వెంకన్న, మరో స్థానం నుంచి యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్‌ విజయం సాధించారు. 2015లో విజయం సాధించిన వీరు ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగారు. వీరిలో బుద్దా వెంకన్నకు మండలిలో విప్‌ పదవి దక్కింది. జిల్లా నుంచి మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీల గడువు ముగిసింది. గత నెలలోనే జగ్గయ్యపేటకు చెందిన టీడీ జనార్ధన్‌ పదవీ కాలం ముగిసింది. ఆయన గతంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జిల్లా సమీక్ష సమావేశంలో జడ్పీ సమావేశాల్లో ఇతర వేదికలపై ప్రతిపక్షం తరఫున గళం విప్పే ప్రజాప్రతినిధులు తగ్గిపోయారు. గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. తూర్పు నుంచి గద్దె రామ్మోహన్‌, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. వంశీ తెదేపాకు రాజీనామా చేశారు. వైకాపాకు మద్దతు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. దీంతో పార్టీ తరఫున జిల్లాకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నట్లు అయింది. విజయవాడ లోక్‌సభ నుంచి కేశినేని నాని గెలుపొందారు. ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం తెదేపా మాజీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కొనసాగుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా గళం విప్పి తెదేపాలో చేరిన ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ అయిన రెండు స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆసక్తికరం. జడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉంది. ఓట్ల లెక్కింపు ఉంటుందా.. లేక తాజాగా నోటిఫికేషన్‌ ఇస్తారా అనేది న్యాయస్థానంలో తేలాల్సి ఉంది. పట్టణాల్లో(యూఎల్‌బీ)లో మాత్రం వైకాపా ఆధిక్యం ఉన్న విషయం తెలిసిందే.

సంతృప్తి నిచ్చింది..: బుద్ధావెంకన్న, తెదేపా

ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు పనిచేయడం తృప్తినిచ్చింది. మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించాం. ఎమ్మెల్సీగా పశ్చిమ నియోజకవర్గానికి శాయశక్తులా సేవలు అందించాం. తెదేపా అధినేత చంద్రబాబు పెట్టిన భిక్ష ఇది. పార్టీ కార్యకర్తగా క్రమశిక్షణతో పనిచేశా. నా కృషికి అధినేత ఇచ్చిన గుర్తింపు. కనకదుర్గ పైవంతెన మంజూరుకు నేను చేసిన పోరాటం సంతృప్తినిచ్చింది. పదవుల కోసం ఆరాట పడే వ్యక్తిని కాను. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడతాను. ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణం బాధ్యతలు అప్పగించారు. రాజీలేని పోరాటాలు చేస్తాను.

ప్రజాసమస్యలపై పోరాటం..: వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, తెదేపా

పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం. పట్టణాల్లో ఆస్తిపన్ను పెంచడం దారుణం. ఒకపక్క అప్పుల కుప్పలు పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆస్తిపన్ను, చెత్తపన్ను వేయడం మున్సిపాలిటీలు తమ బాధ్యతల నుంచి తప్పు కోవడమే. స్థానిక సంస్థల హక్కుల కోసం పోరాడాను. జిల్లా సమస్యలపై పలు సమావేశాల్లో ప్రస్తావించాను. పరిష్కారానికి కృషి చేశాను. తెదేపా హయాంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాం.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని