తాజా వార్తలు

Updated : 19/06/2021 06:38 IST
నాలుగో ప్యాకేజీకి మోక్షం!

వెంకటపాలెం వద్ద పనులు ప్రారంభం

కృష్ణా నదిపై వంతెన నిర్మాణం

ఈనాడు, అమరావతి

యంత్రాల సహాయంతో చెట్లను తొలగించి, నేలను చదును చేస్తున్న దృశ్యం

విజయవాడ బైపాస్‌ రహదారి నాలుగో ప్యాకేజీ పనులకు మోక్షం లభించింది. ఎట్టకేలకు ఈ పనులను నవయుగ సంస్థ చేపట్టింది. శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్మాణ పనులను ప్రారంభించారు. మరో రెండున్నరేళ్లలో దీన్ని పూర్తి చేయనున్నారు. ప్రధాన గుత్తేదారు అదాని నిర్మాణ సంస్థ దీన్ని దక్కించుకుంది. బైపాస్‌ నిర్మాణానికి మూడు, నాలుగు ప్యాకేజీలకు ఒకేసారి టెండర్లను పిలిచి ఖరారు చేసినా నాలుగో ప్యాకేజీ ప్రారంభంలో జాప్యం జరిగింది. మూడో ప్యాకేజీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత జనవరిలోనే మూడో ప్యాకేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. గన్నవరం మండలంలో పనులు ప్రారంభమయ్యాయి. నాలుగో ప్యాకేజీకి రాజధాని గ్రామాల్లోనే అభ్యంతరం వ్యక్తమైంది. న్యాయపరమైన సమస్య తొలిగినట్లు జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు.

రాజధాని భూముల తరహాలోనే తమకు పూలింగ్‌ (సమీకరణ) కింద భూములు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బైపాస్‌ నిర్మాణానికి 2014కు ముందే భూసేకరణ జరిగింది. నాడు రైతులు అంగీకరించారు. పరిహారం కూడా చెల్లించారు. మంగళగిరి మండలంలోని రైతులు పరిహారం తీసుకున్నారు. తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల రైతులు పరిహారం సరిపోదని ఆర్బిట్రేషన్‌కు వెళ్లారు. వెంకటపాలెం, మందడం పరిధిలో 57 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాలు వివాదంలో ఉంది. రూ.50లక్షలు ఎకరాకు చెల్లించారు. ఇది సరిపోదని, భూముల ధరలు పెరిగినందున మార్కెట్‌ ధర ప్రకారం ఇవ్వాలని లేదా.. పూలింగ్‌ ప్రకారం స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ వివాదం వల్ల గుత్త సంస్థ పనులు ప్రారంభించలేదు. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17 కి.మీ దూరం రహదారి, 3.200 కి.మీ వంతెన కలిపి నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ కాంట్రాక్టును ఆదానీ గ్రూపు సంస్థ దక్కించుకుంది. మే నేలలో లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్సీ ఇచ్చాయి. ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొలిక్కి వచ్చింది. దీంతో వెంకటపాలెం వద్ద పనులు ప్రారంభించారు. గుత్త సంస్థ రెండు ప్రాంతాల్లో బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి సామగ్రిని సమకూర్చుకుంది. ఈ రెండు ప్యాకేజీల పనులు హెచ్‌ఏఎం పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 40 శాతం నిధులు, గుత్త సంస్థ 60శాతం నిధులు సమకూర్చుకొంటుంది.

అమరావతి పీడీకి బాధ్యత

ఇంతవరకు నాలుగు ప్యాకేజీలు విజయవాడ జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ పరిధిలో ఉండేవి. నాలుగో ప్యాకేజీ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అమరావతి ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించారు. ఆయన ఈ ప్యాకేజీ భూసేకరణ, వివాదాల సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కారానికి కృషి చేశారు.

పనులు ముమ్మరం..!

బైపాస్‌ మూడో ప్యాకేజీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్యాకేజీలో గన్నవరం మండలం, విజయవాడ గ్రామీణ మండలంలో నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 15 శాతం పనులు పూర్తయ్యాయి. ఆరువరసల రహదారి, స్ట్రక్చర్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గన్నవరం మండలంలో భూసేకరణ మొత్తం పూర్తయింది. చిన్నఅవుట్‌పల్లి దగ్గర నుంచి నున్న మీదుగా గొల్లపూడి వరకు ఈ రహదారి నిర్మాణం చేస్తారు. ప్రారంభంలో ఒక పైవంతెన, గొల్లపూడి వద్ద ఒక పైవంతెన నిర్మాణం చేస్తారు. 2023 వరకు పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ గ్రామీణ మండలంలో భూసేకరణ సమస్య తలెత్తింది. జక్కంపూడి, గొల్లపూడి రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు కొంత మంది ఆర్బిట్రేషన్‌కు వెళ్లారు. అప్పటికే ఎకరాకు రూ.25 నుంచి 50లక్షల వరకు చెల్లించారు. కొంతమంది రైతుల పరిహారం బ్యాంకు ఖాతాలో జమ చేశారు.


భూమి స్వాధీనం చేసుకోవాలి..!

-నారాయణ, పీడీ, ఎన్‌హెచ్‌ఏఐ, విజయవాడ

మూడో ప్యాకేజీ వివాదాలు పరిష్కారమయ్యాయి. పనులు జరుగుతున్నాయి. నాలుగో ప్యాకేజీ బాధ్యతలు తప్పించి మరో అధికారికి అప్పగించారు. మూడో ప్యాకేజీలో జక్కంపూడి వద్ద భూములను ముందస్తుగా స్వాధీనం చేశారు. కానీ రైతుల నుంచి ప్రతిఘటన ఉంది. దస్త్రాల ప్రకారం స్వాధీనం చేశారు. పోలీసుల సహాయంతో భూమిని స్వాధీనం చేయాలని అధికారులను కోరుతున్నాం.


పనులు ప్రారంభించాం..!

-శ్రీనివాస్‌, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ, అమరావతి

న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాం. వెంకటపాలెం వద్ద శుక్రవారం ఏజెన్సీ పనులు ప్రారంభించింది. రెండున్నరేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. ప్రధానంగా భూసేకరణ సమస్య పరిష్కారమైంది. కొంత ఆలస్యమైనా పనులు ప్రారంభమయ్యాయి. అదాని సంస్థ పనులు చేపట్టింది.


పనులు ఇలా..!

వివరం ప్యాకేజీ 4

పనిపేరు గొల్లపూడి - చినకాకాని

ఎన్నివరసలు 6 వరసల రహదారి

అంచనా వ్యయం రూ.1133.85 కోట్లు

దూరం 17.881 కి.మీ

కృష్ణా నదిపై వంతెన 3.200 కి.మీ

గడువు 912 రోజులు

గుత్త సంస్థ ఆదానీ టెండర్‌ వ్యయం 3.5శాతం అధికం
 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని