తాజా వార్తలు

Updated : 14/06/2021 13:39 IST
సంచయిత నియామక జీవో కొట్టేసిన హైకోర్టు

అమ‌రావ‌తి: మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. సంచ‌యిత నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.

2020 మార్చిలో మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టులకు ఛైర్ ప‌ర్స‌న్‌గా సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును రాష్ట్ర ప్ర‌భుత్వం నియమించింది. అప్ప‌టి వ‌ర‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజును తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కావడం వ‌ల్ల వ‌య‌సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాలంటూ సంచ‌యిత నియామకంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు అప్ప‌ట్లో హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ ట్ర‌స్టులకు ఛైర్‌పర్సన్‌ను నియ‌మించింద‌ని ఆయ‌న న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియమించామని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా తిరిగి నియ‌మించాల‌ని ఇవాళ‌ ఆదేశించింది.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని