తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
‘రియల్‌’ మోసగాళ్ల కోసం కొనసాగుతున్న వేట

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: విజయవాడ నగరంలో జరిగిన రియల్‌ఎస్టేట్‌ మోసంలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంకే కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలపర్స్‌ నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కలుగుల్లోకి దూరిన వారిని లాగేందుకు పోలీసు బలగాలు రెండు బృందాలు గాలిస్తున్నాయి. నిందుతులను ఎలాగైనా బాహ్య ప్రపంచంలోకి తీసుకొస్తామని వారు చెబుతున్నారు. ఇప్పటికే సంస్థ నిర్వాహకులు పట్నాల శ్రీనివాసరావు, ఉప్పు మనోజ్‌ కుమార్‌, బలగం రవితేజలపై పటమట స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. మరోవైపు బాధితులకు బెదిరింపులు వస్తున్నాయి. జిల్లాలోని కూచిపూడి స్టేషన్‌లో బాధితులపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు, మీడియా జోలికి వెళ్లొద్దని, కాదని వెళితే కిరాయి గూండాలతో హత్యలు చేయించడానికి వెనకాడబోమని హెచ్చరికలు వస్తున్నాయి. బాధితుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. సంస్థ నిర్వాహకుల్లోని రవితేజ తండ్రితో కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో శనివారం బాధితులపై ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. మోసపోయిన వారు కొందరు పోలీసులకు పూర్తి వివరాలు తెలపగా, మరికొందరు ఏజెంట్లు మాత్రం ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. తాము కట్టించిన వారంతా తమపై ఒత్తిడి తీసుకువస్తారని భయంతో బయటకు రావడంలేదు. ఆదివారం కొంత మంది బాధితులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదపట్లేదు. ఇప్పటికే పటమట స్టేషన్‌లో రియల్‌ మోసానికి సంబంధించి రూ.3.40కోట్ల మేర బాధితులు నగదు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నున్న గ్రామానికి చెందిన ఓ బాధితుడు సంస్థలో రూ.98లక్షలు పెట్టుబడులు పెట్టగా, సంస్థ నిర్వాహకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయారు. ఇలా ఎంతో మంది భయం గుప్పిట్లో పోలీసులతో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని