తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
ముగిసిన టెక్‌జైట్‌ పోటీలు

నూజివీడు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఐదు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి టెక్‌జైట్‌-2021 పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఆఖరి రోజు అతిథి ఉపన్యాసకుడిగా హాజరైన చెన్నై ఐఐటీ ఆచార్యుడు పద్మశ్రీ తాలప్పిల్‌ ప్రదీప్‌ నానో టెక్నాలజీ గురించి వివరించారు. పోటీల్లో భాగంగా ఐఓటీ బేస్డ్‌ వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ సిస్టం అనే ప్రాజెక్ట్‌ ఎక్స్‌పోలో తూర్పు గోదావరి జిల్లా శశి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన జి.నితీష్‌సత్యసాయి, కె.సాయిమణికంఠ, ఎ.శ్రీగణేష్‌, నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఆర్‌.సుధీర్‌ బృందం విజేతగా నిలిచింది. ఐపీఎల్‌ వేలం ఈవెంట్‌లో నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఎస్‌.మౌర్య, ఎ.ధనుంజయ్‌ ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. పీయూసీ విభాగం వక్తృత్వ పోటీల్లో గొట్టిపిల్లి స్రవంతి(నూజివీడు) మొదటి స్థానంలో నిలిచింది. పుణే ట్రినిటీ కళాశాలకు చెందిన రుత్విక్‌ మెహెంగే కాన్ఫ్రెంట్‌ కొవిడ్‌-19 ఈవెంట్‌ విజేతగా నిలిచాడు. 70 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు రూ.6 లక్షల వరకు నగదు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి విశ్వవిద్యాలయం అవకాశం కల్పిస్తుందని, పెయిడ్‌ కోర్సులు చేయాలనుకునే వారికి ఉచితంగా చేసే అవకాశం కల్పించనున్నట్లు టెక్‌జైట్‌ కన్వీనర్‌ కె.కె.సింగ్‌ తెలియజేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని