తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
వన్నెతగ్గిన వస్త్ర వ్యాపారం!

జిల్లాలో 20 శాతానికి పడిపోయిన విక్రయాలు
కొవిడ్‌ ప్రభావంతో కుదేలు
న్యూస్‌టుడే - పెడన, విజయవాడ సిటీ

విజయవాడ కృష్ణవేణి క్లాత్‌ మార్కెట్‌

జిల్లాలో వస్త్ర వ్యాపారం సంక్షోభంలో పడింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విక్రయాలు 20 శాతానికి పడిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ నుంచి మొదలైన సంక్షోభం ప్రస్తుతం తీవ్రస్థాయికి చేరుకొంది. ఆంక్షలు ఇదే రీతిలో కొనసాగితే రానున్న రోజుల్లో జిల్లాలో దాదాపు 20 శాతం వస్త్ర దుకాణాలు మూతపడే అవకాశాలు ఉన్నాయని సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం వస్త్రరంగానికి ప్రముఖ కేంద్రంగా ఉండేది. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, రాజమహేంద్రవరం, ద్వారపూడి, గుంటూరు, చీరాల, ప్రొద్దుటూరు, ఒంగోలు ప్రాంతాల్లో మార్కెట్లు అభివృద్ధి చెందాయి. విజయవాడలో కృష్ణవేణి క్లాత్‌ మార్కెట్‌, వస్త్రలతలు ప్రముఖ మార్కెట్లుగా ప్రసిద్ధి చెందాయి. కృష్ణవేణిలో 370 దుకాణాలు ఉండగా ప్రధానంగా హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తారు. వస్త్రలతలోని 300 దుకాణాల్లో హోల్‌సేల్‌, రిటైల్‌ రెండూ ఉంటాయి. కృష్ణవేణి మార్కెట్‌లో ఏడాదికి రూ.వెయ్యి కోట్లు, వస్త్రలతలో ఇందులో సగం వరకు టర్నోవర్‌ ఉంటుంది. ఇక్కడి నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు వస్త్రాలు సరఫరా చేస్తారు. నగరంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో షోరూంలు, వస్త్ర దుకాణాలు దాదాపు 2 వేలకుపైగా ఉన్నాయి. ఏడాదికి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు టర్నోవర్‌ ఈ రంగంలో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 10 వేలకుపైగా కుటుంబాలు వస్త్రరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లుగా విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. గతంతో పోల్చితే విక్రయాలు దాదాపు 20 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది మార్చి నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌ మొదలైంది. కొవిడ్‌కు ముందు ఈ సీజన్‌లో రద్దీ అధికంగా ఉండేది. నేడు పరిస్థితులు తారుమారై వర్తకులు ఖాళీగా ఉంటున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం  2గంటల వరకు అనుమతించినా విక్రయాల పెరుగుదలపై పెద్దగా ప్రభావం ఉండదని పేర్కొంటున్నారు. పెళ్లిళ్లకు ఆహూతుల సంఖ్యను పరిమితం చేయటంతో సాదాసీదాగా కార్యక్రమాన్ని ముగిస్తున్నారు.  గతంలో మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి జరిగితే రూ.2 లక్షల వరకు దుస్తులకు వెచ్చించేవారు. కొన్ని కుటుంబాలు రూ.5 లక్షలకు పైగా ఖర్చుపెట్టే పరిస్థితి ఉండేది. నేడు రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు ముగించేస్తున్నారు. అది కూడా తమకు సమీపంలో ఉన్న దుకాణాల్లో తీసుకుంటున్నారు.రోజుకు రూ.10 లక్షలకుపైగా విక్రయాలు జరిగే హోల్‌సేల్‌ షాపుల్లో ప్రస్తుతం రూ.లక్ష రావడం కష్టంగా ఉంది. ఒక్కోరోజు రూ.10 వేల అమ్మకాలు కూడా జరగటంలేదని వర్తకులు ఆవేదన చెందుతున్నారు.

జీఎస్టీ నుంచే సంక్షోభం
2017 సెప్టెంబరు నుంచి కేంద్ర ప్రభుత్వం వస్త్రరంగంపై 5 శాతం జీఎస్టీని విధించింది. తర్వాత పెద్దనోట్లను రద్దు చేసింది. ప్రస్తుతం కొవిడ్‌ సంక్షోభం వచ్చింది. ఇలా వరుస ప్రతికూల ప్రభావాలు వస్త్ర రంగాన్ని కుదేలు చేశాయి. గతేడాది ఆర్నెల్లు విక్రయాలు లేక ఇబ్బందులు పడినా సిబ్బందిని కొనసాగించాం. ప్రస్తుతం సంక్షోభం తీవ్రంగా ఉండటంతో లావాదేవీలు పూర్తిగా పడిపోయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి ఈ రంగం చేరుకొంది. ప్రభుత్వం వివిధ రూపాల్లో వడ్డీలేని రుణాలను అందజేసి సంక్షోభం నుంచి బయటకు వచ్చే దిశగా చర్యలు చేపట్టాలి. వస్త్ర వ్యాపారంపై విధించిన జీఎస్టీని కూడా రద్దు చేయాలి. వస్త్ర వ్యాపారులను, సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి టీకాల్లో ప్రాధాన్యమివ్వాలి.

- బచ్చు ప్రసాద్‌, అధ్యక్షుడు, కృష్ణవేణి క్లాత్‌ మార్కెట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని