తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
మెట్రో...లైట్‌ తీసుకో..!

విజయవాడకు ఇప్పట్లో లేనట్లే..!
డీపీఆర్‌ పేరుతో రూ.కోట్లు వృథా
ఈనాడు, అమరావతి

మెట్రో అన్నారు.. తర్వాత లైట్‌ మెట్రో అయింది..! డీపీఆర్‌కు రూ.కోట్లు వెచ్చించారు. డీఎంఆర్‌సీ రూ.70 కోట్ల వరకు తీసుకుని తప్పుకుంది. అమరావతి మెట్రోరైల్‌కార్పొరేషన్‌ (ఎఎంఆర్‌సీ) కాస్తా.. ఏపీ మెట్రో రైల్‌కార్పొరేషన్‌గా మారింది. విజయవాడలోని కార్యాలయం విశాఖకు ఎగిరిపోయింది. ఇక్కడ పేరుకు ప్రధాన కార్యాలయంగా ఉన్నా.. నామమాత్రంగా మారింది. ఏడాదిగా విజయవాడలో ఒక్క కార్యక్రమం లేదు. డీపీఆర్‌ మూలన పడింది. మెట్రోను లైట్‌గా తీసేసుకున్నారు. దీంతో ఆ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ఎన్‌పీ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.  ఈ పరిణామాలతో అసలు విజయవాడకు మెట్రో ఊసే లేదని తేలిపోయింది.
పలు మలుపులు తిరిగిన విజయవాడ మెట్రో.. ప్రస్తుతం మరుగున పడింది. తేలికపాటి మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం ఆమోదించింది. దీని బాధ్యతలను సిస్ట్రా-రైట్స్‌ సంస్థకు అప్పగించారు. 2019 ఏప్రిల్‌లో పూర్తి స్థాయి డీపీఆర్‌ అందించారు. మొత్తం విజయవాడ, అమరావతిలో కలిపి 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికి గాను సుమారు రూ.17,500 కోట్లు పైగా ఖర్చు కానుందని అంచనా.  తొలిదశలో విజయవాడ నగరంలో 38.5 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. అంతకు ముందు విజయవాడ నగరంలో 26 కిలోమీటర్ల మేరకు మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని భావించిన విషయం తెలిసిందే. ఏలూరు, బందరు కారిడార్‌లు మాత్రం నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. దీనికి మెట్రో నిపుణులు శ్రీధరన్‌ సలహాదారుగా ఉన్నారు. దాదాపు రూ.6,800 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు  జైకా సంస్థ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం నుంచి దాదాపు రూ.2వేల కోట్లు అందాల్సి ఉంది. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి అనుమతులు రావడం ఆలస్యం అయింది. కారిడార్ల నిర్మాణానికి టెండర్లను పిలిచి రద్దు చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీధరన్‌ అసంతృప్తికి గురై రాజీనామా చేశారు. జైకా రుణం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫ్రాన్సు, జర్మనీకి చెందిన ఫైనాన్స్‌ సంస్థలు అతితక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. ఈలోగా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మెట్రో ప్రాజెక్టులు అన్నీ... పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలనే విధాన నిర్ణయం  తీసుకుంది.  మెట్రో ఆవశ్యకత  ఉందని భావించిన నాటి సీఎం చంద్రబాబునాయుడు దీనిపై అధ్యయునం కోసం నాటి మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఒక కమిటీని విదేశాలకు పంపించింది. పలురకాల మెట్రో ప్రాజెక్టులు పరిశీలించిన బృందం తేలికపాటి మెట్రో సముచితమని నిర్ణయం తీసుకుంది. దీని డీపీఆర్‌ బాధ్యతలను తామే తీసుకుంటామని రుణసంస్థలు ముందుకు వచ్చాయి. జర్మనీకి చెందిన మెట్రో నిపుణులు డాట్సన్‌ కూడా విజయవాడలో పర్యటించి లైట్‌మెట్రోకు సూచనలు చేశారు. ఆ సూచన మేరకు సిస్ట్రా సంస్థకు అప్పగించారు. విజయవాడ, అమరావతిలో మొత్తం 85 కిలోమీటర్ల దూరం మెట్రోకు ప్రతిపాదనలు అందించింది.  ఇది ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో ఉంటుంది. నేలపై కిలోమీటరు వ్యయం రూ.200 కోట్లు, భూగర్భంలో రూ.400 కోట్లుగా అంచనా వేశారు. తొలిదశలో విజయవాడ నగరంలో రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో అమరావతి కారిడార్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు.

సమీక్షలే లేవు..
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో మెట్రో లేదు. అసలు సమీక్షలే లేవు. ఒకసారి మాత్రమే సమావేశం ఏర్పాటు చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంత ఖర్చు ఎందుకని ఎండీని ప్రశ్నించారు. జర్మన్‌ ప్రతినిధి బృందం రాలేదు. కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ సంప్రదింపులు నిలిపివేసింది. మరోవైపు భూసేకరణకు రెవెన్యూ శాఖ హడావుడి చేసినా.. తర్వాత మౌనంగా ఉంది.  కొంతమంది నిర్వాసితులు తాము భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. బడ్జెట్‌లోనూ మెట్రో ప్రస్తావన లేకుండా పోయింది. డీపీఆర్‌ను ఆమోదించిన తర్వాత పీపీపీ విధానంలో నిర్మాణం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆ జాబితాలో విజయవాడ ప్రాజెక్టు లేదని తెలిసింది. డీపీఆర్‌ బీరువాలకే పరిమితమైంది. ఇటీవల ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి రాజీనామాతో మరోసారి మెట్రో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఎండీ తప్పుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పట్లో విజయవాడకు మెట్రో కష్టమేనని నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని