తాజా వార్తలు

Published : 14/06/2021 04:15 IST
వైద్యం, ప్రభుత్వ పథకాలకే ప్రాధాన్యం

కలెక్టర్‌ జె.నివాస్‌
ఈనాడు, అమరావతి

ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం, రోగులకు మెరుగైన చికిత్స అందించడం తన ముందు ఉన్న ప్రథమ కర్తవ్యమని కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేర్చడం, నివేశన స్థలాలు కేటాయించి గృహాలను నిర్మించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నివాస్‌ ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

అందరికీ వైద్యం.. తక్షణ కర్తవ్యం
వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తాను. అత్యవసరంగా పడకలను ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితిని సమీక్షించడం.. అందరికీ వైద్యం సక్రమంగా అందేలా చూడడం ప్రస్తుత కర్తవ్యంగా భావిస్తున్నాను.  కొవిడ్‌ వ్యాప్తి నిలకడగా ఉన్నా.. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. వారికి అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

పథకాలు అందలేదనే ఫిర్యాదు లేకుండా.. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటాం. అర్హులు ఎవరూ తమకు పథకం అందలేదన్న ఫిర్యాదు ఉండకూడదు. ఎవరైనా మిగిలినా మళ్లీ గుర్తించి వారికి మంజూరు చేస్తాం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రాధాన్య ప్రాజెక్టుగా  నివేశన స్థలాల లేవుట్లలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. జిల్లాలో 1.70లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలన్నది లక్ష్యం.

అందరినీ కలుపుకుని వెళతాను.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నా దృష్టికి తెచ్చే సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తా.  
అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వాటికి తావివ్వకుండా పనిచేయాలని హెచ్చరిస్తున్నాను.

ప్రతి గ్రామంలో 10 పడకల ఐసొలేషన్‌ కేంద్రం.. మూడో దశ ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాం.  ప్రతి గ్రామంలో 10 పడకలతో ఐసొలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలనేది నా ప్రతిపాదన. జిల్లాలో వెయ్యి గ్రామాలు  ఉంటే 10 వేల పడకలు ఏర్పాటు అవుతాయి. అక్కడ మందులు, ఒక నర్సు ఉంటారు. ఒక్కో కేంద్రానికి రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది.  కేరళలో ఇంచుమించు ఇదేవిధానం అవలంభించడం వల్ల చాలా వరకు నియంత్రించ గలిగారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఆమోదం వస్తే ఈ విధానంలో చర్యలు తీసుకుంటాం. చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందనేది ఊహాజనితమే. అయినా వారికి సరిపోయేలా వెంటిలేటర్లు  ఏర్పాటు చేశాం. ఇంకా పెంచుతున్నాం. సీఎస్‌ఆర్‌ కింద పడకలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అప్రమత్తతతో వ్యవహరించాలి.

ఆస్పత్రుల్లో మౌలిక వసతులు.. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు పెంచాల్సి ఉంది. ఇవి కాకుండా ప్రధానంగా సిబ్బంది ముఖ్యం. నర్సులు, మేల్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సరిపోయేంత ఉంటే.. ఒక్క డాక్టరు అయినా వందమంది రోగులను సక్రమంగా చూస్తారని భావిస్తున్నాను. దీనికి జిల్లాలో ఎంతమంది ఉన్నారు.. వారి వివరాలు సేకరించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.  

ప్రైవేటు చికిత్సపై నిఘా.. ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా ఏర్పాటు చేస్తాం. జరిమానాలతో మార్పు రాదు. ఎవరికి వారు ఆలోచించాలి. ఒక ఆసుపత్రిపై నిషేధం విధిస్తే.. వంద మంది రోగులకు ఇబ్బంది కలుగుతుంది. ఆ విధంగా కాకుండా వారికి అవగాహన కల్పించాలి. నిఘా ఏర్పాటు చేసి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా  నిరోధించాలి. అన్నింటిని ఒకే గాటన కట్టడం కూడా సరికాదు. సేవలు అందించే వాటిని గుర్తించాల్సి ఉంది. పెద్ద ఆసుపత్రులను స్వయంగా నేనే పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నా. నిరంతరం తనిఖీలు ఉంటాయి. ఆసుపత్రులను భయం పెట్టే విధంగా కాకుండా బాధ్యతగా తీసుకొనే విధంగా ఉంటాయి.

ఇక్కడ పనిచేయడం అదృష్టం.. కృష్ణాజిల్లాలో కలెక్టర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తాను. దీనిని బాధ్యతగానే తీసుకుంటాను. అందరి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.  జిల్లా గతంలో అన్ని రంగాల్లోనూ ప్రథమంగా ఉండేది. ఆ స్థాయిలో తీసుకెళ్లడానికి అధికారులు, ఉద్యోగులు అందరూ కలిసి పనిచేయాలి. ఆధిపత్య పోరు, సమన్వయం లోపం ఉంటే మాత్రం సహించం. మొదటి సారి హెచ్చరిస్తాం. అదే పొరపాటు మళ్లీ మళ్లీ జరిగితే.. కఠిన చర్యలు ఉంటాయి.  ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు ఇదే వర్తిస్తుంది.  

చెరువుల అభివృద్ధికి ప్రణాళిక.. గ్రామీణ ప్రాంతంలో చెరువులను మోడల్‌గా అభివృద్ధి చేయాలనేది నా ఆశయం.  2 ఎకరాల్లో విస్తరించిన చెరువులను తీసుకొని అన్ని విధాల ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. దీనిని ఉపాధి పథకంతో జతచేస్తాం.
పట్టణాలకు ప్రాధాన్యం..  పట్టణ ప్రాంతాలకు కమిషనర్లు, పాలక మండళ్లు ఉన్నాయి. వారి ప్రణాళికలకు ప్రాధాన్యం ఇస్తాను. విజయవాడలో కమిషనర్‌గా నేను చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేశారు.   నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కాలువల ఆధునికీకరణ, సుందరీకరణ, పచ్చదనం పెంపుపై దృష్టిసారిస్తాను.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని