గురుముఖం

Published : 15/06/2021 18:49 IST
కాశీలో వదిలేయాల్సింది ఏంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: కాశీకి వెళ్తే, కాయో.. పండో వదిలేయాలని పెద్దలు అంటారు. అందులో మర్మమేమిటి? అసలు శాస్త్రం ఏం చెబుతోంది? కాశీకి వెళితే కాయో, పండో వదిలేయాలని ఎక్కడా చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానంతో వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రం చెబుతున్నది ఏంటంటే? కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి ‘కాయాపేక్ష, ఫలాపేక్ష’ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలని అంతరార్థం.

ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అంటే ఈ కాయముపై (శరీరముపై అపేక్షని) , ఫలాపేక్షా (కర్మఫలముపై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాస్తా కాయ, పండుగా మారిపోయింది. అంతే కానీ, కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఏమీ ఉండదు. శాస్త్రం నిజంగా ఎలా చెబుతుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది.

అంతే కానీ, మామిడి పండుని, వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అసలు ప్రతి మనిషి తన జీవిత చరమాంకంలో బంధాలు, రాగ ద్వేషాలు, తోటి వారితో వివాదాలు వదిలి పెట్టాలి. కాశీ యాత్ర చేయటం వెనుక అసలు అంతరార్థం ఇదే. ఆ విశ్వనాథుడిని దర్శించి, అప్పటి నుంచి మృత్యువు దరి చేరే వరకూ మనసును ఆ ఈశ్వరుడిపై లగ్నం చేయాలి. అప్పుడే జీవితమనే పరమపదసోపాన పటంలో ఆత్మ ఈశ్వరుడి పాదాల చెంతకు చేరుతుంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని