గురుముఖం

Updated : 20/08/2019 17:35 IST
కృష్ణుడు పుట్టిన వేళకే ఆమె కూడా..

కృష్ణాష్టమి అంటే- కృష్ణ, అష్టమి. ఇది కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి. శ్రావణ కృష్ణపక్ష అష్టమి నాటి రాత్రికి శాక్తేయ సిద్ధాంతంలో ‘మోహ రాత్రి’ అని పేరు. కృష్ణజన్మకు పూర్వమే గల ఈ రాత్రి ఉపాసకులకు ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే, నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహాశక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే!

దైవీ గుణసంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింపజేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది, అనంతమైనది! పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్‌ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంతాది భావాల్ని ప్రకటించిన గోవిందుడి గాథ- వివిధ కోణాల్లో దివ్యత్వాన్ని ఆవిష్కరించింది.

బాల్యంలోనే దావాగ్నిని మింగి గోకులాన్ని కాచిన స్వామి ఆయన. బ్రహ్మదేవుడి అహాన్ని అణచివేస్తూ- ఏకకాలంలో అనేకంగా లేగల, గోప బాలుర రూపాల్ని ధరించి అబ్బురపరచాడు. మట్టుపెట్టడానికి మాయారూపాలతో వచ్చిన దనుజుల్ని చడీచప్పుడు లేకుండా రూపుమాపిన బాల వీరమూర్తి కృష్ణుడు. అరచేతితో గోవర్ధనగిరిని ఎత్తినవాడు. స్వర్గలోకంలోని ఇంద్రుడి దర్పాన్ని నిగ్రహించాడు. శుద్ధజలాల్ని విషమయం చేసిన కాళీయ సర్పాన్ని నియంత్రిం చాడు. ఫణి ఫణాలపై నర్తించి, అతడిని ఆ నీటి నెలవు నుంచి మళ్లించి, సురక్షిత స్థలానికి పంపి అనుగ్రహించాడు. ప్రకృతిని కలుష రహితంగా ఉంచాలని సకల మానవాళికీ బోధించాడు కృష్ణుడు. బహుజన్మల యోగసాధనతో పరబ్రహ్మ ప్రాప్తి కోసం గోపికా రూపాలు ధరించిన శుద్ధ జీవులకు ఆయన బ్రహ్మానంద రసానుభవాన్ని ప్రసాదించాడు. రాసలీలా వినోది, నాదావతారుడికి వేణుగానాన్ని వినిపించిన సంగీత మూర్తి కృష్ణపరమాత్మ.

కృష్ణుడు కువలయాపీడం అనే మదగజాన్ని నిరోధించాడు. చాణూర ముష్టికాది మల్లయోధుల్ని ఓడించాడు. కంస శిశుపాలాది దుష్టుల్ని దునుమాడినప్రతాపశాలిఆయన. జరాసంధ, రుక్మి, కాలయవనుడు వంటి దుర్మార్గుల దురాగతాల్ని అడ్డుకున్నాడు.ఆయన రాజనీతి చతురుడు. వంచనతో ఆగకుండా ద్రౌపదీదేవిని నిండుసభలో పరాభవించిన కౌరవుల్ని హెచ్చరిం చాడు. అనివార్యమైన సంగ్రామంలో వారికి తగిన పాఠం చెప్పిన ధర్మరక్షకుడు కృష్ణుడు.

కృష్ణభగవానుడు ఆర్తితో శరణు వేడిన పాంచాలిని ఆదుకున్నాడు. ధర్మానికి కట్టువడి తననుఆశ్రయించిన పాండవుల్ని దరిజేర్చుకున్నాడు. జ్ఞానభక్తుడై చేరుకున్న కుచేలుణ్ని ఆదరించిన స్వామి ఆయన. జరాసంధుడి చెరలో గల ఎనభై మంది రాజుల్ని విడిపించి, సుస్థిరత కలిగించిన కృపాళువు. నరకాసురుడి బారిన పడిన పదహారువేల మంది రాచకన్యలకు, వారి కోరిక మేరకు భద్రత చేకూర్చిన క్షేమంకరుడు! తన వైపు గల సైన్యం కంటే తానే చాలని ఎంచుకున్న అర్జునుడి రథానికి సారథిగా విజయాన్ని ప్రసాదించాడు. కృష్ణుడు విశ్వజనీన తత్వశాస్త్రమైన గీతామృతాన్ని వర్షించిన జ్ఞానానంద మూర్తి. తన, పర అనే భేదం లేకుండా, వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలాల్ని ప్రసాదించాడు. చెక్కుచెదరని చిరునవ్వుతో నిలిచిన ఆయన ‘యోగీశ్వరేశ్వరుడు’.

వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వమార్గాల్ని కృష్ణుడు చక్కగా సమన్వయించాడు.సర్వశాస్త్రసారంగా అర్జునుడికి గీతాశాస్త్రాన్ని బోధించడమే కాక, తన అవతార పరిసమాప్తి వేళ ఉద్ధవుడికి తత్వబోధ చేసిన జగద్గురువు ఆయన.

అవతార కాలంలోనే కాక ఆ తరవాతి కాలంలోనూ- తనను స్మరించి, ఆరాధించి, కీర్తించిన యోగుల్ని తరింపజేసిన భగవానుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు... ఇలా ఎందరెందరో కృష్ణయోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తిమార్గంలో జ్యోతి స్వరూపులై వెలుగునింపారు.

ఇంతమంది మహాత్ముల భావనలో ప్రకాశించిన శ్రీకృష్ణ చైతన్యానికి సమస్త భక్తకోటీ సాదర ప్రణామాలు అందజేస్తోంది!

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని