గురుముఖం

Updated : 07/02/2019 19:55 IST
రుద్రాక్షలు శివుని కన్నీటి బిందువులా?

రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. రుద్రాక్షలకు అంత మహత్యమెలా వచ్చిందన్న దానిపై దేవీ భాగవతంలో పూర్తిగా పొందుపరిచారు. త్రిలోక సంచారి నారద మునీంద్రునికి నారాయణమహర్షి రుద్రాక్షల పవిత్రత గురించి విశదీకరించాడు. పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు తన దుర్మార్గాలతో అందరినీ బాధపెట్టేవాడు. అతని బాధలు భరించలేక దేవతలు కైలాసానికి వెళ్లి రాక్షస బాధ నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి ప్రార్థనను ఆలకించిన మహేశ్వరుడు అఘోరం అనే మహా అస్త్రాన్ని సృష్టించారు. అది మహోజ్వలమైన ఆయుధం. ఆయుధ ప్రయోగానికి ముందు త్రిపురాసుర వధ, లోక సంక్షేమం, విఘ్నశాంతికి ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానం సుదీర్ఘంగా సాగింది. మూడు నేత్రాలను మూసివేసి ఈశ్వరుడు ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలోనే స్వామి మూడు కన్నుల నుంచి కన్నీటి బిందువులు రాలాయి. ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలు స్వామి క‌న్నీటి బిందువుల నుంచి ఏర్పడ్డాయి. ఎడమ కన్ను నుంచి 12, కుడికన్ను నుంచి 16, మూడో కన్ను అగ్నినేత్రం నుంచి నల్లని రంగులో వున్న 10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి. శంభుని నేత్రాల నుంచి వచ్చిన కన్నీటి ధారలతో ఏర్పడిన వృక్షాలు కనుకే రుద్రాక్షలకు అంత పవిత్రత ఏర్పడింది. వీటిలో అనేక రకాల రుద్రాక్షలు వుంటాయి. ఏక ముఖ నుంచి పద్నాలుగు ముఖాల రుద్రాక్ష వరకు వుంటాయి. వీటిలో పద్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఏ రుద్రాక్షను ధరిస్తే మంచిదో గురువు, పెద్దలను అడిగి తెలుసుకోవాలి. రుద్రాక్ష ధారణకు ఒక్కోదాని విశిష్టతను తెలుసుకుందాం.

ఏక ముఖ రుద్రాక్ష- శివుడు
రెండు ముఖాలు - శివకేశవులు
మూడు ముఖాలు - అగ్ని రకం
నాలుగు ముఖాలు - బ్రహ్మ స్వరూపం
పంచముఖాలు - కాలాగ్ని
ఆరు ముఖాలు - షణ్ముఖ (సుబ్రమణ్యస్వామి)
ఏడు ముఖాలు - అనంగ (ఐశ్వర్యం)
ఎనిమిది ముఖాలు - వినాయకుడు
తొమ్మిది ముఖాలు - భైరవుడు
పది ముఖాలు - జనార్దనుడు
పదకొండు ముఖాలు - రుద్రుడు
పన్నెండు ముఖాలు- ద్వాదశాదిత్యులు
పదమూడు ముఖాలు - కార్తికేయుడు
పద్నాలుగు ముఖాలు - ఇవి పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన రుద్రాక్షలు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని