గురుముఖం

Updated : 31/10/2019 20:50 IST
గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచుతారు ఎందుకు?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం తొలగిన అనంతరమే శుద్ధిచేసి దర్శనాలకు అనుమతిస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఈ నిబంధన వర్తించదు. రాహు కేతు క్షేత్రం కావడంతో యావత్ భూమండలంలో గ్రహణ సమయాల్లోనూ ఈ ఒక్క ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది.

గ్రహణ సమయాల్లో ఎందుకు మూసివేస్తారు..
భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తాం. రాహు కేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. అందుకనే ఆలయాలను మూసివేస్తారు.

శ్రీకాళహస్తిలో మాత్రం..
శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా వ్యవహరిస్తారు. దక్షిణ భారతంలోని అనేక శైవాలయాలను దక్షిణ కాశీగా పరిగణిస్తారు. అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే నివాసముండే కైలాసంతో పోలుస్తూ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన శివలింగంపై ఉన్న కవచంలో 27 నక్షత్రాలు, తొమ్మిది రాశులు ఉంటాయి. యావత్‌ సౌర కుటుంబాన్ని ఈ కవచం నియంత్రిస్తుంటుంది. కవచంలో అన్ని గ్రహాలు ఉండటంతో వాటిపై ఆ లయకారకుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అందుకనే గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై పడదు. దీంతో పాటు ఇక్కడ రాహు కేతు పూజలుంటాయి. రాహు కేతు దోషం కలిగిన వారు గ్రహణ సమయాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటే దోష నివారణ లభిస్తుంది. ఒక పురాణగాథ ప్రకారం పుత్ర శోకంలో ఉన్న వశిష్ట మహర్షికి ఇక్కడ ఈశ్వరుడు పంచముఖ నాగ లింగేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకనే రాహు కేతు క్షేత్రంగా పిలుస్తారని తెలుస్తోంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని