గురుముఖం

Updated : 31/10/2019 20:50 IST
గురు పౌర్ణమి

విద్య వికాసానికి మూలం. తమస్సు తొలగించి, జీవనాన ఉషస్సు కలిగించి, శాశ్వతమైన తేజస్సు అందించేది విద్య. మాయ, అవిద్యలు మనిషిని ఆవరించి ఉంటాయి. వాటివల్ల జన్మ మృత్యు జరా వ్యాధులు ఏర్పడతాయి. చిత్త భ్రమ, విభ్రాంతులు సంభవిస్తాయి. అలాంటి వాటిని తన జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి- గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాల్ని శుద్ధిచేసే మహితాత్మ స్వరూపం- గురువు. జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే త్రిమూర్తుల ఆకృతి- గురువు.

సనాతన భారతీయ సంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది. ఏ తరహా విద్యను నేర్పే గురువైనా పూజనీయుడే! తల్లిదండ్రుల తరవాత అంతటి సమున్నతమైన స్థితి గురువులది. ఆచరించి చూపి విద్యార్థులకు ఆలంబనగా నిలిచేది ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడు ఆరాధనీయ మూర్తిమత్వ స్వరూపుడని ‘నిరుక్తం’ ప్రకటించింది. ‘విద్యాదానాన్ని మహాయజ్ఞంగా భావించే ఉత్తమ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అంశతో వ్యక్తమవుతాడు. శ్రద్ధాసక్తులతో, భక్తి విశ్వాసాలతో గురువు నుంచి జ్ఞానాన్ని అందుకునే విద్యార్థికి భవిష్యత్తు బంగారు మయమవుతుంది’ అని మనుస్మృతి ప్రస్తావించింది. విద్యాభ్యాసం ద్వారా హితోపదేశం చేయడమే కాక అభ్యుదయ మార్గాన్ని దర్శింపజేసేవాడే గురువని ‘శుక్రనీతి’ తెలియజేసింది. అందుకే ఈశ్వరుడికి, ఆత్మశక్తికి, గురువుకు మధ్య భేదం లేదని ఆదిశంకరులు పేర్కొన్నారు.

కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా, ద్వాపర యుగంలో వ్యాసుడిగా, కలియుగంలో ఆదిశంకరాచార్యుడిగా గురు స్వరూపం భాసిల్లింది. భారతీయ ఆర్ష వాంగ్మయంలో వేదవ్యాసుడికి ప్రముఖ పాత్ర ఉంది. మేధాశక్తి, ధర్మదీక్ష, ఆధ్యాత్మిక పరిణతి, జ్ఞాన పటిమలతో వ్యాసమహర్షి సనాతన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేశారు. నేటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి- వ్యాస జయంతి. గురు పరంపరలో విఖ్యాతి చెందిన వ్యాసుడు నిండు పున్నమి రోజున ఆవిర్భవించి, తన సుజ్ఞానమనే సిరివెన్నెల వెలుగులతో ఆర్ష ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని దీప్తిమంతంగా ఆవిష్కరించారు. అమూల్యమైన వేదరాశిని సంస్కరణ చేసి, నాలుగు వేదాలుగా విభజించి, వేద వ్యాసుడయ్యారు. అష్టాదశ పురాణాలను, ఉపపురాణాల్ని రచించారు. భక్తి ప్రాధాన్యమైన భాగవత మకరందాన్ని అందించారు. తాను దర్శించిన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మసూత్రాలుగా ప్రకటించారు. చతుర్విధ పురుషార్థాల సాధన కోసం పంచమ వేదమైన మహాభారతాన్ని సృజించి, జాతికి అమూల్య కానుకగా అనుగ్రహించారు. నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా, రెండు చేతులు మాత్రమే ఉన్న విష్ణువుగా, ఫాలనేత్రం లేని పరమేశ్వరుడిగా వేదవ్యాసుణ్ని భారతీయ సనాతన ధర్మం అభివర్ణించింది. ‘గురోర్గురువు’ అనే విశేషణం వ్యాసుడికి దక్కిన కీర్తి కిరీటం. పరంపరాగతంగా ప్రభవించిన అనేకమంది సద్గురువులకు వ్యాసుడు ఆరాధ్యుడు.

శ్రీకృష్ణ పరమాత్మకు సమకాలీనుడిగా వ్యాసుడు అవతరించి కృష్ణ ద్వైపాయనుడిగా ఆది గురువుగా తేజరిల్లాడు. గురుపూర్ణిమ పర్వదినాన్ని వేదవ్యాసుడి పరంగానే జరుపుకోవాలని ‘గణేశ పురాణం’ నిర్దేశించింది. నైమిశారణ్యంలో వేదవ్యాసుడు తపస్సు చేసి గణపతి సాక్షాత్కారం పొందిన రోజు ఆషాఢ పౌర్ణమిగా చెబుతారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, దర్శక గురువు, మహా గురువు, పరమ గురువు... ఇలా ఎన్నో విధాలుగా గురు సంవిధానం పరిఢవిల్లుతోంది. ఈ గురు స్వరూపాలన్నింటి ఏకీకృత మూర్తిమత్వం- వేదవ్యాసుడు. ఆచార్య పీఠాన్ని అధిరోహించి ఎందరెందరో సద్గురువుల్ని, శిష్యకోటిని ప్రభావితం చేసిన విశిష్ట వైభవోపేత గురు సార్వభౌముడు- వేద వ్యాసుడు! వ్యాసుడు ప్రసాదించిన జ్ఞాన సంపదవల్లే భరత ఖండం- తపోభూమిగా, వేదభూమిగా, దేవభూమిగా, ముక్తిపథగామిగా సాకారమైంది. వ్యాసుడు సృజించిన సారస్వతం వల్ల దివ్యధాత్రిగా ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది.
 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని