గురుముఖం

Published : 21/11/2020 17:39 IST
కార్తిక మాసంలో వన భోజనం వెనుక ఆంతర్యం ఏంటి?

కార్తిక  మాసంలో వనభోజనానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ భోజనానికి ఎంచుకొనే వనంలో అన్నిరకాల వృక్షాలతో పాటు ఉసిరిచెట్టు ఉన్న వనం అయితేనే మంచిది. వనభోజనాన్ని గురించి, దీప దానాన్ని గురించి వశిష్ఠుడు కార్తీకపురాణంలో వివరించి చెప్పాడు. ఉసిరిచెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ కలిసి భోజనం చేయాలి. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి సులభంగా కలుగుతుందన్నాడు వశిష్ఠుడు. అసలు కార్తీక పురాణ శ్రవణం చేస్తేనే మహాపాప విముక్తి కలుగుతుందని కూడా చెప్పాడు. దీనికి ఉదాహరణగా దేవదత్తుడి కథను వివరించాడు ఆ రుషి.

పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే పండితుడుండేవాడు. ఆయనకు దేవదత్తుడు అనే కుమారుడుండేవాడు. దేవదత్తుడు తండ్రి మార్గంలోకాక పరమ దుర్మార్గుడై ఎన్నో పాపకృత్యాలు చేస్తుండేవాడు. దేవశర్మ దేవదత్తుడిని నియంత్రించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. చివరకు కార్తిక వ్రతాన్నైనా ఆచరించి చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలని దేవదత్తుడికి చెప్పాడు దేవశర్మ. దేవదత్తుడు ఆ మాటలు వినకుండా ఎదురుతిరిగాడు. కలత చెందిన తండ్రి ఇక సహించలేక ఎలుకగా పుట్టి అడవిలో చెట్టు తొర్రలో పడి ఉండు అని శపించాడు. అప్పటికి కనువిప్పు కలిగింది దేవదత్తుడికి. శాపవిమోచనం చెప్పమని తండ్రిని వేడుకొన్నాడు. అప్పుడా తండ్రి కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా విన్ననాడు శాపవిముక్తి అని బదులిచ్చాడు. మరుక్షణమే దేవదత్తుడు ఎలుకగా మారి అడవిలోని ఒక చెట్టు తొర్రలోకి వెళ్ళాడు. తన శాపానికి దుఃఖిస్తూ అక్కడ తిరగసాగాడు దేవదత్తుడు. ఇలా ఉండగా కొంత కాలానికి ఆ చెట్టు సమీపంలో ఉన్న నదికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యబృందంతో కలిసి కార్తీకస్నానం చేయటానికి వచ్చాడు.

స్నానాలయ్యాక గురుశిష్యులంతా ఆ చెట్టు కిందకు చేరారు. గురువు తన శిష్యులకు ధర్మోపదేశం చేయసాగాడు. ఇంతలో ఒక వేటగాడు అటుగా వచ్చాడు. విశ్వామిత్రుడిని, ఆయన శిష్యబృందాన్ని చూడగానే ఆ వేటగాడి మనసు మారిపోయింది. సత్పురుష దర్శనం వల్ల అతడికి ఆ క్షణాన దుర్మార్గపు ఆలోచనలు పోయి సన్మార్గం మీదకు మనసు మళ్లింది. అదే విషయాన్ని విశ్వామిత్రుడి ముందు సాగిలపడి ఆ వేటగాడు చెప్పాడు. విశ్వామిత్రుడు చెబుతున్న కథలు, మంచి మాటలు, తన మనసును మార్చేసాయని, అవేవో తనకు సంపూర్ణంగా వివరించమని ప్రార్థించాడు ఆ వేటగాడు. తాను చెబుతున్నది కార్తీక పురాణమని అది విన్నందువల్లే వేటగాడిలో దుర్మార్గపు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వచ్చాయన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వేటగాడు ఆ కథలేవో తనకు వివరించాలని వేడుకొన్నాడు. విశ్వామిత్రుడు కరుణించి వేటగాడికి సంపూర్ణ కార్తీక పురాణాన్ని వివరించాడు. చెట్టుతొర్రలో ఉన్న ఎలుక చెవులకూ ఆ కథలన్నీ వినిపించాయి. ఆ కారణంగా ఎలుకకు శాప విముక్తి కలిగి దేవదత్తుడిగా అక్కడ అవతరించాడు. విశ్వామిత్రుడి పాదాల మీద పడి తన విషయమంతా వివరించి ఆయన ఆశీస్సులందుకొని ఇంటికి చేరుకున్నాడు దేవదత్తుడు. ఈ కథలో పెద్దలు చెప్పిన మంచి మాటలను వినకపోతే కలిగే నష్టాలతో పాటు కార్తిక పురాణ శ్రవణ ఫలితమూ కనిపిస్తుంది.

కార్తీకమాసం నెల రోజులపాటు విష్ణువును కస్తూరి, గంధం, పంచామృతాలతో అభిషేకించటం ఎంతో మేలన్నాడు. సంధ్యాసమయంలో విష్ణుసన్నిధిలో దీపారాధన చేసినా, దీపదానం చేసినా అనంత పుణ్యఫలం లభిస్తుందన్నాడు. గోధుమపిండి లేదా బియ్యపుపిండితో ప్రమిదను చేసి మంచి పత్తితో వత్తిని చేసి, ఆవునెయ్యిలో వత్తిని తడిపి వెలిగించాలి. అలా మాసమంతా చేసి చివరి రోజున ఒక మంచి పండితుడిని పిలిచి వెండి ప్రమిదను, భమిడి పత్తితో వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య ఉంచి ఆ రోజున కార్తీక పూజాదికాలన్నీ అయ్యాక దానం చెయ్యాలని వశిష్ఠుడు అన్నాడు. ఈ దీపదానం వల్ల కలిగే ఫలితాన్ని లుబ్ధ వితంతు మోక్ష కథ ద్వారా వివరించాడు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని