గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేసి గతంలో పోలీసులకు లొంగిపోయిన గిరిజనుడు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడన్న అనుమానంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం కొత్తపాలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపాలేనికి చెందిన కొర్ర పిల్కు అలియాస్ పుల్కో (36) ఇంట్లో నిద్రిస్తుండగా.. సాయుధ మావోయిస్టులు వచ్చారు. పిల్కును నిద్ర లేపి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి గొడ్డలితో నరికి హతమార్చారు. అడ్డుకునేందుకు యత్నించిన పిల్కు భార్యపైనా దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది. మిలీషియా సభ్యుడిగా పని చేస్తూ పోలీసులకు లొంగిపోవడమే కాకుండా.. వారికి ఇన్‌ఫార్మర్‌గా మారినందుకు శిక్షించామని మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు. పిల్కుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.