సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదుపై చర్య
చిలకలూరిపేట పట్టణం, గ్రామీణ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే తెదేపా కార్యకర్త పిల్లి కోటిని శుక్రవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో.. ప్రతిపక్ష నేతను అడ్డుకున్న పులివెందుల ఎలుక పిల్ల జగన్‌రెడ్డి అంటూ ఫేస్‌బుక్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి ఇటీవల పోస్టు చేశారు. దీనిపై చిలకలూరిపేట వైకాపా సోషల్‌మీడియా ప్రతినిధి దొడ్డా రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్బన్ సీఐ బిలాలుద్దీన్, పట్టణ ఎస్సై షఫీల ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు కోటి ఇంటికెళ్లి ఆయన్ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, యువత నాయకుడు వంశీకృష్ణ, లీగల్‌సెల్ న్యాయవాది హరిబాబు బృందం, కార్యకర్తలు చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసు చర్యలకు నిరసనగా తెదేపా కార్యకర్తలు స్టేషన్ మెట్లపై కూర్చున్నారు. సమాచారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే పిల్లి కోటికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అనంతరం పిల్లి కోటి విలేకరులతో మాట్లాడారు. తన భార్య నిండు గర్భిణి అని ప్రాధేయపడినా స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అర్ధరాత్రి తనను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి మానసికంగా వేధించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవయిందని విమర్శించారు. రాజకీయాలు ఎందుకంటూ సీఐ హెచ్చరించారని, తన ప్రాణానికి హాని కలిగితే సీఐ, ఎస్సైలే కారణమని అన్నారు.