నలుగురి ప్రాణాలు తీసిన మద్యం సరదా
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం
పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: అది జాతీయ రహదారి... అర్ధరాత్రి దాటుతున్న సమయం... కారులో హుషారెత్తించే సంగీతం... పైగా డ్రైవర్ చేతిలో బీరు సీసా... హద్దు మీరిన వేగం. ఫలితం... కనురెప్పపాటులో ప్రమాదం... నాలుగు నిండు ప్రాణాలు బలి. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియా కార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న ఐషర్ వాహనాన్ని కారు అతి వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు యువతులు ఉన్నారు. ఘటన స్థలానికి పెనుకొండ సీఐ శ్రీహరి, ఎస్సై వెంకటేశ్వర్లు చేరుకొని, నుజ్జునుజ్జయిన కారులో నుంచి మృతదేహాలను పొక్లెయిన్, క్రేన్ సాయంతో బయటకు తీశారు.
వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారే...
ఆధార్, పాన్‌కార్డుల ఆధారంగా మృతులను బెంగళూరుకు చెందిన మనోజ్ మిత్తల్ (38), మహబూబ్ ఆలం (31), దిల్లీకి చెందిన ఆంచల్ సింగ్ (20), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రేఖగా(29) గుర్తించారు. కారు నడుపుతున్న మహబూబ్ ఆలం చేతిలో బీరు సీసా కనిపించింది. మద్యం తాగుతూ వాహనం నడిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విమానాశ్రయం వరకు వెళ్లాలని బంధువులవద్ద నుంచి అతను కారు తీసుకొచ్చినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. మనోజ్ మిత్తల్ బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారని, ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని సీఐ వివరించారు.