పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి రాయితో బాది హత్య చేసిన దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని ముచ్చర్లవారి వీధిలో వంగా రామప్రసాద్‌కు (50) రెండంతస్తుల ఇల్లు ఉంది. అందులోని 3 వాటాలను వేర్వేరు వ్యక్తులకు అద్దెకిచ్చారు. వీరిలో ఒకరైన అడపా చినకొండయ్య ఒంటరిగా ఉంటున్నాడు. ఇతడు రెండు నెలల నుంచి అద్దె సరిగా ఇవ్వట్లేదు. ఇదే విషయమై యజమానికి, చినకొండయ్యకు సోమవారం ఉదయం వాగ్వాదం చోటుచేసుకుంది. రాత్రి సైతం ఘర్షణ జరగ్గా... విచక్షణ కోల్పోయిన చినకొండయ్య రాయితో రామప్రసాద్‌పై దాడి చేయడంతో తల, ముఖంపై తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు రామప్రసాద్ భార్య, కుమారుడు, కుమార్తె ఇంట్లో లేరు. అదే సమయంలో పక్కనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. మంగళవారం ఉదయం స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.