దారుణానికి పాల్పడిన ఇంటి పాలేరు
తెలంగాణ సరిహద్దు గ్రామంలో ఘటన
కుభీరు(భైంసా), న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాకు సరిహద్దులోని ఈ గ్రామంలో అయిదేళ్ల చిన్నారిపై.. ఇంటి పాలేరుగా పనిచేస్తున్న మాలేగామ్‌కర్ బాబు(40) అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్థులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు బుధవారం మధ్యాహ్నం తన మనవరాలిని తీసుకుని పొలం వెళ్లాడు. కాసేపటికి చిన్నారి ఏడుస్తుండడంతో ఇంటివద్ద దింపి రావాల్సిందిగా పాలేరు బాబును పురమాయించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన రైతు.. మనవరాలు, పాలేరు ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. స్థానికులతో కలిసి పొలాల్లో, ఊరిలో వెతికారు. రాత్రి 8 గంటల సమయంలో గ్రామ సమీపంలోని వాగు ఒడ్డున బాలిక చెప్పులు కనిపించడంతో వాగువెంట వెదికారు. తుంగలో చిన్నారి మృతదేహం కనిపించడంతో హతాశులయ్యారు. ఒంటిపై దుస్తులు లేకపోవటం, శరీరంపై పళ్లతో కొరికిన గాయాలు ఉండడంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన బాబు వాగులోని తుంగలోనే దాక్కొని, ఘటనా స్థలానికి పోలీసులు రాగానే లొంగిపోయాడు. తానే బాలికను చంపినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని నాందేడ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, భోకర్‌లో గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.