గోదావరిఖని, న్యూస్‌టుడే: సమగ్ర శిక్ష అభియాన్ అదనపు రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు పొన్నూరు వెంకటశ్రీహరిని గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సమగ్రశిక్ష అభియాన్‌లో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసిన ఎలగందుల రమేశ్ ఆత్మహత్యకు కారణమయ్యారన్న అభియోగం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా విద్యాశాఖలో డీఎల్‌ఎంటీగా పనిచేసిన రమేశ్.. సెక్టోరల్-1 పోస్టు కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును పైఅధికారికి పంపించారు. అక్కడ పనిచేసే బాలికా విద్యాభివృద్ధి అధికారిణి పద్మ.. రమేశ్‌ను మానసికంగా వేధింపులకు గురిచేశారు. సెక్టోరల్-1 పోస్టుకు అవకాశం రాకుండా ఏఎస్‌పీడీతో కుమ్మక్కై అడ్డుపడ్డారు. సెక్టోరల్-1 పోస్టు కోసం ఏఎస్‌పీడీ వెంకటశ్రీహరి వద్దకు వెళ్లిన రమేశ్‌కు అక్కడా వేధింపులు ఎదురయ్యాయి. తోటి ఉద్యోగుల ముందు వెంకటశ్రీహరి అవమానపరిచేలా మాట్లాడాడు. ఈ విషయాన్ని రమేశ్ కుటుంబ సభ్యులు, తోటి మిత్రులకు చెప్పుకొని బాధపడ్డారు. అవమానం భరించలేక 2019, ఆగస్టు 9న గోదావరి నదిలో దూకి రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి ఏఎస్‌పీడీ వెంకటశ్రీహరి, జీసీడీవో జంపాల పద్మ కారణమని లేఖ రాశారు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణలో వెంకటశ్రీహరి, పద్మలే కారణమని తేలింది. నెల రోజుల క్రితం పద్మను అరెస్టు చేయగా.. గురువారం వెంకట శ్రీహరిని అరెస్టు చేసినట్లు సీఐ పర్స రమేశ్ తెలిపారు.