పొలానికి వెళ్లి అక్కడే చనిపోయిన వైనం
గుండె పోటు కారణమంటున్న వైద్యులు
భీమడోలు, ఉంగుటూరు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు బత్తిన బుల్లెబ్బాయి (42) గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లారు. కొంత సమయం తర్వాత అక్కడే విగతజీవిగా మారారు. ఇటీవలే గ్రామంలో పలువురు అస్వస్థతకు గురికావడంతో బుల్లెబ్బాయి కూడా అంతుచిక్కని వ్యాధికి గురై ఉంటారని ఆయన బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే... బుల్లెబ్బాయి మృతికి అంతుచిక్కని వ్యాధి కారణం కాదని కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటన విడుదల చేశారు. పొలంలో చల్లిన పురుగు మందు ప్రభావంతో మృతి చెంది ఉండవచ్చని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు. పూళ్ల వైద్యాధికారి లీలాప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... పొలంలో ఉండగా బుల్లెబ్బాయికి గుండెపోటు రావడంతో బోదెలో బోర్లా పడిపోయారని, నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక మృతి చెందారని తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.